Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికంటే ముందు ఫోన్ ట్యాపింగ్ పై అరోపణలు చేసింది తానేనని అన్నారు. హైదరాబాగ్, సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు చాల మంది సంసారాలను నాశనం చేశారని బండి సంజయ్ విమర్శించారు.
సీబీఐకి అప్పగించాలి: బండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao), రాధాకిషన్ (Radha Kishan).. అనేక మంది ఉసురు పొసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలని అన్నారు. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)లకు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు సూత్రదారులు వారిద్దరేనని బండి సంజయ్ అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు.. సీఎంఓ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసారని బండి సంజయ్ అన్నారు.
నిందితులను రక్షించే ప్రయత్నం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావుగా రాచమర్యాదలు చేయడం ఆపేయాలని బండి సంజయ్ పట్టుబట్టారు. పేపర్ లీక్ అయిన కేసులో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేశారని బండి అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఫోన్ మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ఫేస్ టైం, సిగ్నల్ యాప్ లలోనే ఫోన్ మాట్లాడుకున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt).. ప్రభాకర్ రావు, ఇతర నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేటీఆర్ అమెరికా (America)కి వెళ్లి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చి సిట్ (SIT) విచారణకు హాజరయ్యారని బండి పేర్కొన్నారు.
Also Read: Gold Rate Today: వీకెండ్‌లో ఝలక్ ఇచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు.. ఎంతంటే?
సిట్ ముందుకు బండి
మరోవైపు తనకు సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. తనకు సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. త్వరలో వచ్చి విచారిస్తామని చెప్పారని అన్నారు. ‘మీ ఫోన్ కూడా ట్యాప్ (Phone Tap) అయ్యిందని మాకు ఆధారాలు లభించాయి. దయచేసి విచారణకు సిద్ధంగా ఉండండి’ అంటూ బండికి సిట్ అధికారులు శుక్రవారం తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. తాజా బండి సంజయ్ కూడా ధ్రువీకరించిన నేపథ్యంలో.. అతడి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశముంది.