Crime News: బత్తుల ప్రభాకర్.. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గజదొంగ. పట్టుకోవటానికి ప్రయత్నించినపుడు పోలీసులపై కాల్పులు జరిపిన కరడుగట్టిన నేరస్తడు. తాజాగా చెన్నైను అడ్డాగా చేసుకుని అక్కడ దొంగతనాలు మొదలు పెట్టినట్టుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బత్తుల ప్రభాకర్ చిన్న చిన్న చోరీలతో మొదలు పెట్టి ఆ తరువాత కరడుగట్టిన నేరస్తునిగా మారిన విషయం తెలిసిందే.
బత్తుల ప్రభాకర్..
4 కోట్ల రూపాయలు కూడబెట్టుకుని గోవాలో ఆస్తులు కొనాలని టార్గెట్ గా పెట్టుకుని ఇంజనీరింగ్ కాలేజీల్లో పలు చోరీలకు పాల్పడ్డాడు. గతంలో మాదాపూర్ లోని ప్రిజం పబ్బు వద్ద పట్టుకోవటానికి ప్రయత్నించిన పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నించాడు. అయితే, సహచరునికి బుల్లెట్ గాయమైనా పోలీసులు పట్టు వదలకుండా బత్తుల ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా బత్తుల ప్రభాకర్ నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర పోలీసులు అతన్ని కొంతకాలం క్రితం ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పై అక్కడికి తీసుకెళ్లారు.రాజమండ్రి జైలుకు రిమాండ్ చేశారు. సెప్టెంబరులో విజయవాడ కోర్టులో హాజరు పరిచి తిరిగి జైలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో బత్తుల ప్రభాకర్ చేతులకు ఉన్న సంకెళ్లతో పారిపోయాడు. ఆ తరువాత అటు ఆంధ్రప్రదేశ్…ఇటు తెలంగాణ పోలీసులు కూడా అతని కోసం గాలిస్తున్నారు.
చెన్నైలో..
తాజాగా బత్తుల ప్రభాకర్ చెన్నైలో ఉన్నట్టుగా ఇక్కడి పోలీసులకు సమాచారం అందింది. చెన్నైలో ఓ రాజకీయ నాయకునికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 60 లక్షల రూపాయల దొంగతనం కేసులో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు నేరానికి పాల్పడింది బత్తుల ప్రభాకర్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చెన్నై పోలీసులు ఉభ య తెలుగు రాష్ట్రాల పోలీసులకు తెలిపారు.

