Bhatti Vikramarka: విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకుగాను ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు 40% డైట్ చార్జీలు సైతం పెంచింది, ప్రత్యేకంగా మెనూ రూపొందించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం ముగించుకొని మధిర నియోజకవర్గ పర్యటనకు వెళ్లే క్రమంలో ఆకస్మికంగా కొనిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ఆకస్మికంగా పర్యటించారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఒకసారి గా గురుకుల వసతి గృహం వైపు తిరిగింది. డిప్యూటీ సీఎం నేరుగా గురుకుల వసతి గృహంలోకి వెళ్లి మొదట భవనాన్ని పరిశీలించారు, తదుపరి విద్యార్థులు, ప్రిన్సిపల్ తో మాట్లాడారు.
Also Read: Mallu Bhatti Vikramarka: ఈ సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్.. 3,745 కోట్ల పెట్టుబడులు1,518 మందికి ఉపాధి
సమాచారం సేకరిస్తున్నారా? లేదా?
విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, మెనూ చార్ట్ ఎక్కడ, మెనూ పాటిస్తున్నారా? లంచ్ టైం ఎన్ని గంటలకు? ఈరోజు మెనూ ఏంటి? ఈ కళాశాలలో చదువుకొని బయటికి వెళ్లిన విద్యార్థినీలు ఏఏ రంగాల్లో స్థిరపడ్డారు తదితర సమాచారం సేకరిస్తున్నారా? లేదా? వంటి వివరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి డైనింగ్ రూమ్ లోకి వెళ్లి వంట పాత్రలను తనిఖీ చేశారు. ఆ తర్వాత విద్యార్థినీలతో కలిసి భోజనం చేశారు. భోజనం సమయంలో విద్యార్థినీలు ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారు, స్థానికంగా విద్యాబోధన ఎలా ఉంది, రోజు మెనూ పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు వేసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. భోజనాల తదుపరి లైబ్రరీ నీ సందర్శించారు.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా?
గ్రూప్ వన్, గ్రూప్ టు వంటి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా? పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ లైబ్రరీలో ఉందా లేదా? అడిగి తెలుసుకున్నారు. దోమలు రాకుండా సువాసనలు వెదజల్లే అగరవత్తులను విద్యార్థినిలు తయారు చేస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. పిల్లలు తయారు చేసే అగరవత్తులను బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను ఆదేశించారు. విద్యార్థుల హెల్త్ కార్డులు ఉన్నాయా? లేదా? అని ప్రశ్నించగా విద్యార్థుల హెల్త్ యాప్ ను స్థానిక ప్రిన్సిపల్ డిప్యూటీ సీఎం కు వివరించారు. చివర్లో విద్యార్థినీలు తాము వేసిన పెయింటింగ్ ను డిప్యూటీ సీఎంకు బహుకరించారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం గురుకులంలో మొక్కలు నాటారు. ఎటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా గురుకులంలో పర్యటించడంపై సర్వత్ర ఆసక్తి నెలకుంది.
Also Read: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

