Crime News: ఇంజనీరింగ్ కాలేజీలోకి చొరబడ్డ దొంగ కోటి రూపాయలను లూటీ చేసి ఉడాయించాడు. పోతూ పోతూ సీసీ కెమెరా(CCTV camera)లకు అనుసంధానం చేసి ఉన్న డీవీఆర్(DVR) ను కూడా ఎత్తుకెళ్లాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ఇటీవల ఆంధ్రా పోలీసులకు మస్కాకొట్టి పరారైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్(Bathula Prabhakar) ఈ చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్(Abdullapur) మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దుండగుడు చొరబడ్డాడు.
ఒకే ఒక్క సీసీ కెమెరాలో..
ఆఫీస్ లోని బీరువాను విరగ్గొట్టి అందులో దాచి పెట్టిన కోటి రూపాయల నగదును దోచుకుని ఉడాయించాడు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కాలేజీకి వచ్చి విచారణ ప్రారంభించారు. దీంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తి కాలేజీలో ఏర్పాటు చేసిన 200 సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్(DVR) ను కూడా అపహరించినట్టుగా వెల్లడైంది. అయితే, ఒకే ఒక్క సీసీ కెమెరాలో చోరీకి పాల్పడ్డ వ్యక్తంగా అనుమానిస్తున్న వ్యక్తి రికార్డయ్యాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read; CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు
బత్తుల ప్రభాకర్..
కాగా, విశ్వసనీయ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ భారీ చోరీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పాల్పడినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP), కేరళ(Kerala), కర్ణాటక(karnataka) రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో చోరీలు చేసిన బత్తుల ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ చేయటం గమనార్హం. మొయినాబాద్, నార్సింగి స్టేషన్ల పరిధుల్లో మూడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇలాగే నేరాలు చేశాడు. 2025, ఫిబ్రవరిలో గచ్చిబౌలి ప్రిజం బార్ వద్ద పోలీసులు బత్తుల ప్రభాకర్ ను పట్టుకున్నారు. ఆ సమయంలో తప్పించుకోవటానికి బత్తుల ప్రభాకర్ కాల్పులు జరుపగా హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి(Venkat Reddy)కి బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి.
రాజమండ్రి జైలుకు రిమాండ్
అయినా, వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు వీరాస్వామి, ప్రదీప్ రెడ్డితోపాటు పబ్ బౌన్సర్ల సహాయంతో బత్తుల ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. కాగా, ఓ కేసులో ఆంధ్రా పోలీసులు బత్తుల శ్రీనివాస్ ను గతనెలలో ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకెళ్లి రాజమండ్రి జైలుకు రిమాండ్ చేశారు. విజయవాడలోని కోర్టుకు తీసుకెళ్లి వస్తుండగా దారిలో బత్తుల ప్రభాకర్ ఎస్కార్టు పోలీసులకు టోకరా ఇచ్చి పరారయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనం జరిగిన తీరు.. సీసీ కెమెరాలో లభ్యమైన ఫుటేజీని పరిశీలిస్తే ఈ నేరానికి పాల్పడింది అతనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read; MBBS Seats: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో మరో 175 ఎంబీబీఎస్ సీట్లు?
