Honeymoon Case: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో (Meghalaya Honeymoon Murder Case) ఎవరూ ఊహించని సంచలన ట్విస్ట్ బయటపడింది. హనీమూన్ కోసం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మేఘాలయకు వెళ్లి అక్కడ భర్త రాజా రఘువంశీ హత్యకు గురవ్వగా, ఆ మర్డర్ చేయించింది భార్య సోనమ్ అని పోలీసులు గుర్తించారు. పెళ్లి కాకముందు రాజ్‌కుశ్వాహా అనే వ్యక్తిని సోనమ్ ప్రేమించింది. అతడి కుట్ర ప్రకారమే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. సుపారీ ఇచ్చి కిరాయి మనుషులతో ఈ హత్య చేయించినట్టు పోలీసులు నిర్ధారించారు. సుపారీ నిందితులు ఇద్దరు ఇండోర్‌కు చెందినవారు, ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తేల్చింది. సోనమ్ ప్రియుడు రాజ్‌కుశ్వాహా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఘాజీజూర్‌లో లొంగిపోయిన సోనమ్
సోనమ్‌ను అరెస్టు చేయడానికి కొన్ని గంటల ముందు ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. విషయం చెప్పడంతో బంధువులు వెంటనే ఇండోర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు ఘాజీపూర్ పోలీసు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. సోనమ్ లొంగిపోవడంతో నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోనమ్ చెప్పినట్టుగా రాజా రఘువంశీని హత్య చేసిన విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ అనే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ అనే నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సోనమ్‌కు రాజ్‌కుశ్వాహా ప్రియుడు అని, తమకు సుపారి ఇచ్చారని వెల్లడించారు. మృతుడి సోదరుడు విపిన్ మాట్లాడుతూ, సోనమ్ తమకు కాల్ చేసిందని, తాము ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలిపారు. సోనమ్ తమకు ఫోన్ చేసినప్పుడు ఆమె మాటల్లో భయం కనిపించిందని, ఆమె చెప్పిన తర్వాతే ఏం జరిగిందనే విషయాన్ని తాము నమ్మగలమని పేర్కొన్నాడు.
Read this- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక ఒళ్లుగగుర్పొడిచే నిజాలు.. సీఎం కూడా బాధితుడే!
సోనమ్ కాల్ రికార్డింగ్స్ పట్టించాయ్
ఇండోర్ పోలీసులు, షిల్లాంగ్ పోలీసులు, ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఈ కేసును ఛేదించారు. సోనమ్ కాల్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. రాజ్‌కుశ్వాహాతో మాట్లాడుతూ సోనమ్ ఈ తతంగాన్ని నడిపినట్టు గుర్తించారు. రాజ్ కుష్వాహా ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేశారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏర్పాట్లు చేసింది సోనమ్: మృతుడి తల్లి
మేఘాలయకు హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిందని సోనమేనని తన కొడుకు రాజా చెప్పాడని మృతుడి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. హనీమూన్‌కు వెళ్లడానికి ముందు మాత్రమే తమకు చెప్పారని, టికెట్లు బుక్ చేసింది కూడా సోనమేనని వివరించారు. ట్రిప్‌ను మరిన్ని రోజులు కూడా ఆమె పొడిగించిందని, తిరిగి వచ్చేందుకు టికెట్లు బుక్ చేయలేదని తెలిపారు. ఎలాంటి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో తమకు ప్రతిరోజూ ఫోన్ చేస్తుండేదని, తన కొడుకుని పొట్టనపెట్టుకుందని విలపించారు. రూ.10 లక్షల విలువైన నగలు కూడా ధరించి వెళ్లారని, అలాంటి ప్రదేశానికి నగలు ఎందుకని ప్రశ్నించగా, సోనమ్ తీసుకురమ్మన్నంటూ తన కొడుకు సమాధానమిచ్చినట్టు పేర్కొంది. రాజాను సోనమ్ హత్య చేయించి ఉంటే ఆమెను ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు.
Read this- Kaleshwaram project: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీశ్ రావు.. ఏం చెబుతారో?
సోనమ్ తండ్రి స్పందన ఇదే
రెండు కుటుంబాల అంగీకారంతోనే వివాహం జరిగిందని సోనమ్ తండ్రి దేవీ సింగ్ అన్నారు. తన కూతురిపై నమ్మకం ఉందని, అలా చేయదని అన్నారు. తన కూతురికి ఎలాంటి పాపం తెలియదని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను తన కూతురితో మాట్లాడలేదని అన్నారు. మేఘాలయ పోలీసులు అబద్ధం చెబుతున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు.
మే 11న వివాహం
రాజా రఘువంశీ, సోనమ్ వివాహం మే నెల 11వ తేదీన జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 22వ తేదీని టూవీలర్‌ను రెంట్‌కు తీసుకొని మౌలాకియాత్ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి వారి ఆచూకీ తెలియరాలేదు. మిస్సింగ్ కేసు నమోదవ్వడంతో 11 రోజులపాటు పోలీసులు అన్వేషించారు. జూన్ 2న ఎట్టకేలకు రఘువంశీ మృతదేహాన్ని సోహ్రా ప్రాంతంలోని ఒక లోతైన లోయలో పోలీసులు గుర్తించడంతో అసలు విషయాలు బయటకొచ్చాయి. కత్తితో పొడిచి చంపారని, అతడికి సంబంధించిన చాలా వస్తువులు కూడా మాయమైనట్టు తేలడంతో హత్యగా పోలీసులు గుర్తించారు. ఒక్కరే ఈ పనికి పాల్పడే అవకాశం లేదని గుర్తించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా సుపారీ హత్యగా తేలింది. కాగా, ఈ కేసును విజయవంతంగా ఛేదించిన మేఘాలయ పోలీసులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసించారు.