Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ విచారణకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరవుతున్నారు. గత నెల 20న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హాజరవుతున్నట్లు హరీశ్ రావు స్వయంగా ప్రకటించారు. దీంతో కమిషన్ ముందు ఏం చెబుతారు, ఏయే అంశాలు ప్రస్తావిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాత విషయాలను గుర్తు చేస్తూ..
బీఆర్ఎస్ పాలనలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు, నిర్మాణం జరిగాయి. ఆ సమయంలోనే మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లు కుంగాయి. ఆ ప్రభుత్వంలో హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ప్రభుత్వం వేసింది. కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ సబ్ కమిటీలో సభ్యులుగా, నాడు మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు కమిటీ రిపోర్టు ఇచ్చిందని హరీశ్ రావు పేర్కొంటున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డీపీఆర్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని ఇప్పటికే ప్రకటించారు. అదే విషయాన్ని కమిషన్ ముందు చెబుతానని మీడియాకు సైతం వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే అందులో రెండు మాత్రమే కుంగాయని వాటికి మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కల్పతరువు అని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే మాటల మంటలు
సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తున్న హరీశ్, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఇచ్చిన అంశాలనే చెబుతారా, కమిషన్ ఏ ప్రశ్నలు సంధించనుంది, దానికి ఆయన ఏం చెబుతారనే ఆసక్తి నెలకొన్నది. ప్రాజెక్టు మొదలు నుంచి ఆర్థిక లావాదేవీల వరకు హరీశ్ రావు కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎన్డీఎస్ఏ సైతం ఎక్కడ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించొద్దని చెప్పలేదని, రిపోర్టులో సైతం రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే సరిపోతుందని ఇచ్చిందని పేర్కొన్నారు.
త్వరలోని అన్ని వివరాలు బయటికీ!
తన వాక్ చాతుర్యం, రాజకీయ నైపుణ్యాన్ని కమిషన్ ముందు హరీశ్ ఎలా అనుసరిస్తారు, నాడు సబ్ కమిటీలో ఉన్న ఈటల, తుమ్మలపై ఏం చెబుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈటల రాజేందర్ తనకు ఏం సంబంధం లేదని, అంతా కేసీఆర్, హరీశ్ రావులే చేశారని, ఆర్థిక అనుమతులు సైతం మంత్రిగా ఇవ్వలేదని కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఖర్చు చేశారని కమిషన్‌కు వివరించారు. మంత్రి తుమ్మల సైతం కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల అబద్ధాలు చెప్పారని, హరీశ్ రావు సైతం అలాగే మాట్లాడుతున్నారని తెలిపారు. కాళేశ్వరంపై సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇవ్వలేదని మీడియాకు తెలిపారు. సబ్ కమిటీ రిపోర్టు, కమిటీ ఏం చేసింది అనేది కమిషన్‌కు త్వరలోనే అన్ని వివరాలు ఇస్తానని, త్వరలో కమిషన్‌కు లేఖ రాస్తానని, ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చామన్నారు.
Also Read: Congress Party: అసంతృప్తుల పరిస్థితి ఏమిటో? వరుసగా బుజ్జగింపులు!
ఈ నెల 11న కేసీఆర్ హాజరు!
పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు కమిషన్ ముందు ఏం చెప్పనున్నారనేది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఈటల వ్యాఖ్యలపై, తుమ్మల మీడియా ముందు పేర్కొన్న అంశాలపైనా హరీశ్ రావు ఎలా స్పందిస్తారనేది చర్చకు దారితీసింది. కమిషన్ విచారణ ముగిసిన తర్వాత మీడియా ముందు ఏం మాట్లాడతారు, కమిషన్‌ను సైతం ఇరుకునబెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక, రెండు రోజుల వ్యవధిలోనే ఈ నెల 11న కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.