Crime News: చేతబడి చేస్తున్నాడన్నా అనుమానంతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన మామా అల్లుళ్లతోపాటు వారికి సహకరించిన మరో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి(DCP Balaswamy), అదనపు డీసీపీ నర్సయ్య(DCP Narsayya), టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 1న ఉస్మానియా వర్సిటీ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట కట్ట వద్ద దారుణ హత్యకు గురైన వ్యక్తి మృతదేహం దొరికిన విషయం తెలిసిందే. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఈస్ట్ జోన్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వేర్వేరు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు.
సీసీ కెమెరాల ఫుటేజీ..
ఈ క్రమంలో హత్యకు గురయ్యింది ధూల్ పేట నివాసి మాగు సింగ్ (58)గా గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించటం ద్వారా జైలో కారులో మాగు సింగ్ మృతదేహాన్ని తెచ్చి ఎర్రకుంట కట్ట వద్ద పడేసినట్టు నిర్ధారించుకున్నారు. దాని నెంబర్ ఆధారంగా రాంనగర్ నివాసి, చేపల వ్యాపారి అయిన షేక్ గౌస్ (43), చిలకలగూడ నివాసి, జైలో కారు డ్రైవర్ సయ్యద్ షోయబ్ (32), వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన మొహమ్మద్ ఇలియాస్ (20)ను అరెస్ట్ చేశారు.
Also Read: Annagaaru Vastaaru: కార్తి ‘అన్నగారు వస్తారు’ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?..
అనుమానంతో..
విచారణలో మాగు సింగ్(Magu Singh) తనపై చేతబడి చేస్తున్నాడని షేక్ గౌస్(Shake Gous) అనుమానించినట్టు వెళ్లడయ్యింది. అందువల్లే వ్యాపారం దెబ్బ తినటంతోపాటు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయనుకున్న షేక్ గౌస్ ఎలాగైనా మాగు సింగ్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన అల్లుడు షేక్ షోయబ్ కు చెప్పి సహకరించాలని అడిగాడు. దీనికి ఒప్పుకొన్న షేక్ షోయబ్ కుట్రలో తన స్నేహితుడు మొహమ్మద్ ఇలియాస్ ను భాగస్వామిగా చేశాడు. ఆ తర్వాత రూపొందించుకున్న పథకం ప్రకారం ఈనెల 1న మాగు సింగ్ ను చిలకలగూడలోని బూస్ట్ హోటల్ లేన్ వద్దకు పిలిపించారు.
ఎర్రకుంట కట్ట వద్ద
మాగు సింగ్ అక్కడికి రాగానే ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ మాగు సింగ్ స్పృహ కోల్పోయాడు. ఆ వెంటనే ముగ్గురు కలిసి మాగు సింగ్ ను జైలో కారులోకి ఎక్కించి ఎర్రకుంట కట్ట వద్దకు బయల్దేరారు. దారిలో షేక్ గౌస్ కత్తితో మాగు సింగ్ గొంతు కోసి వేయటంతో అతను ప్రాణాలు వదిలాడు. ఎర్రకుంట కట్ట వద్ద మాగు సింగ్ శవాన్ని రోడ్డు పక్కన వదిలేసి నిందితులు ముగ్గురు వచ్చిన కారులో ఉడాయించారు. నిందితుల నుంచి పోలీసులు కారు, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్లు, కత్తి, రెండు మొబైల్ ఫోన్లు, రక్తం మరకలు ఉన్న దుస్తులను పోలీసులు సీజ్ చేశారు. రెండు రోజుల్లోనే కేసులోని మిస్టరీ ఛేధించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐలు అప్పలనాయుడు, చంద్రశేఖర్, రవికుమార్, రాములు, ఎస్ఐ చారిని డీసీపీ బాలస్వామి అభినందించారు.
Also Read: Raipur ODI: కోహ్లీ, గైక్వాడ్ సెంచరీల మోత.. రాయ్‌పూర్ వన్డేలో భారీ స్కోర్ దిశగా టీమిండియా
