Hyderabad: 2.50 లక్షల సరుకు సీజ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నిషేధిత ఈ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (Hyderabad) అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 2.50లక్షల విలువ చేసే ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎస్ సదన్ ప్రాంతంలోని కలందర్ నగర్ నివాసి తారీఫ్ హుస్సేన్ (30) వృత్తిరీత్యా టూ వీలర్ వాహనాల డీలర్. కాగా, తేలికగా డబ్బు సంపాదించేందుకు కొంతకాలంగా నిషేధిత ఈ సిగరెట్ల దందా చేస్తున్నాడు. ఎజాజ్ అనే వ్యక్తి నుంచి వాటిని తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన సీఐ సైదాబాబు, ఎస్ఐలు రామారావు, మధుతోపాటు సిబ్బందితో కలిసి నిందితున్ని అరెస్ట్ చేశారు. నికోటిన్ ను విడుదల చేసే ఈ సిగరెట్లను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితున్ని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు.
Read Also- Nayanthara: ‘మూకుతి అమ్మన్ 2’కు పవర్ ఫుల్ తెలుగు టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
ఇంట్లోనే బెల్ట్ షాప్
నిందితుని అరెస్ట్…318 బాటిళ్లు సీజ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డ్రై డేస్ లో ఇంట్లోనే బెల్ట్ షాప్ నడుపుతున్న వృద్ధున్ని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 57.2 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మీర్ చౌక్ నివాసి నర్సింగ్ రావు (62) వ్యాపారి. కాగా, డ్రై డే వచ్చిన ప్రతీసారి వైన్ షాపుల నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొని ఇంట్లో స్టాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐలు మహేశ్, మహ్మద్ సమీవుజ్ జమా, నవీన్ తో కలిసి దాడి చేసి నర్సింగ్ రావును అరెస్ట్ చేశారు. గాంధీ జయంతి రోజున అమ్మటానికి తెచ్చి పెట్టుకున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితున్ని మీర్ చౌక్ పోలీసులకు అప్పగించారు.
Read Also- Ponnam Prabhakar: రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్
సెల్ ఫోన్ కొట్టేసి ఖాతా ఖాళీ చేశారు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సెల్ ఫోన్ కొట్టేసి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసిన ముగ్గురి నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 68 ఏళ్ల వృద్ధుడు గతనెల 17న తార్నాక వెళ్లటానికి ఉప్పల్ వద్ద షేరింగ్ ఆటో ఎక్కాడు. డ్రైవర్ మహ్మద్ మొయినుద్దీన్ (31) డబ్బును ఫోన్ పే ద్వారా చెల్లించాలంటూ అడగటంతో వృద్ధుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసి డబ్బు చెల్లించాడు. కాగా, ఆటోలో అతని పక్కనే కూర్చున్న మహ్మద్ మొయినుద్దీన్ సహచరుడు మహ్మద్ సయ్యద్ సల్మాన్ (21) మొబైల్ ఫోన్ లాక్ కోడ్ నెంబర్ చూసి గుర్తుపెట్టుకున్నాడు. ఆ తరువాత తార్నాక వద్ద నిందితులు ఇద్దరు కలిసి వృద్ధుని దృష్టి మరల్చి ఫోన్‌ను తస్కరించి వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత నేరుగా మేడ్చల్ వెళ్లి పెట్రోల్ పంపుతోపాటు మరికొన్ని షాపుల్లో చోరీ చేసిన మొబైల్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్లు చేసి నగదు తీసుకున్నారు. తమ మరో సహచరుడైన మహ్మద్ హుస్సేన్‌తో (32) కలిసి మొత్తం 1.95లక్షల రూపాయలను స్వాహా చేశారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం సీఐ ప్రమోద్ కుమార్, ఎస్ఐ షేక్ అజీజ్ తోపాటు కానిస్టేబుళ్లు ప్రభు, విజయ్, రామాంజనేయ ప్రసాద్, వేణు, శ్రీనివాస్ అశ్విన్ తో కలిసి విచారణ జరిపి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
