Viral video: సమాజంలో మంచితనం, మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలు ప్రతిరోజూ అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక, బయట ప్రపంచానికి కానరాని ఇలాంటి ఘటనలు ఎన్నో ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సాటి మనిషి అనే భావన మరచిపోయి అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ మనసును కలిచివేస్తుంటాయి. ఇదేసమయంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కొన్ని ఘటనలు వెలుగుచూస్తుంటాయి. అలాంటి వీడియో (Viral video) ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
భీకుమాత్రే అనే ముంబైకి చెందిన వ్యక్తి ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ‘‘పొట్టకూటి కోసం ఛాయ్ విక్రయించే ఓ వ్యక్తి రైలులో చాలాసేపు అటుఇటు తిరిగిన తర్వాత అలసటతో ఒక్కచోట కూర్చొని, అలాగే నిద్రపోయాడు. అక్కడున్న ఓ యువ పోలీస్ ఈ విషయాన్ని గమనించి, ఛాయ్ విక్రేత బాధ్యతను తీసుకున్నాడు. రైల్లో తిరుగుతూ టీ అమ్మడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఛాయ్ అమ్మే వ్యక్తి నిద్ర మేల్కొని, టీ ఫ్లాస్క్ లేకపోవడం గమనించి కంగారు పడ్డాడు. కాస్త ముందుకు వెళ్లి చూడగా, టీలు అమ్ముతున్న పోలీస్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏం ఫర్వాలేదని చెప్పిన ఆ పోలీస్.. ఛాయ్ అమ్మే వ్యక్తిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. టీ అమ్మగా వచ్చిన డబ్బో, లేక అతడి జేబులోని గానీ డబ్బు తీసి టీ విక్రయించే వ్యక్తి చేతిలో పెట్టాడు’’ అంటూ పోస్టులో రాసుకొచ్చాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కాగా, ఆ పోలీసు డబ్బు ఇస్తున్నప్పటికీ తీసుకునేందుకు టీ విక్రయించే వ్యక్తి నిరాకరించడం వీడియోలో కనిపించింది. హృదయాలను హత్తుకునేలా ఉన్న ఈ వీడియో వైరల్‌గా మారింది. చాలామంది లైకులు కొట్టారు. పలువురు మిశ్రమంగా స్పందించి కామెంట్లు పెట్టారు. ‘‘ఎంత అందమైన చర్య ఇది. నిజంగా ఎంత గొప్ప మానవత్వం!. ఈ స్టోరీ మనకు మంచి చెబుతోంది. నిజమైన దయాగుణానికి ఎలాంటి హద్దులూ ఉండవు. అది టీ అమ్మేవాడైనా, పోలీస్ అయినా. ఇలాంటి చిన్నచిన్న ఘటనలే ఈ ప్రపంచాన్ని మంచి దిశగా పయనించేలా చేస్తాయి. మనుషులం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరినొకరు మేల్కొలపాలి. ప్రేమను పంచాలి’’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘మనిషితనం ఇంకా బతికే ఉంది. మనం దానిని నిలబెట్టుకోవాలి’’ అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
స్క్రిప్ట్ అంటూ విమర్శలు
ఈ వీడియోపై పలువురు నెటిజర్లు విమర్శలు గుప్పించారు. ఇదొక స్క్రిప్ట్ అంటూ కామెంట్లు చేశారు. నిజమైన మానవత్వం కెమెరామెన్‌లోనే ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ఛాయ్ అమ్మే వ్యక్తి నిద్రపోతాడని, మళ్లీ నిద్రలేచే సమయానికి కెమెరా అటువైపే తిప్పి ఉండాలని కెమెరామెన్‌కు ఎలా తెలుసు? అంటూ పలువురు కామెంట్లు చేశారు. ‘‘ఇది మానవత్వం కాదు. ఇదొక డ్రామా రీల్. ఇది మానవత్వం కానే కాదు. నిజమైన హీరోలు చాలామంది ఉన్నారు. పోలీస్‌మ్యాన్, టీ విక్రయించే వ్యక్తి ఇద్దరూ కలిసి ఒక పరిపూర్ణమైన రీల్ తీశారు. ఎడిటింగ్, రికార్డింగ్, కెమెరా పనితనం అన్నీ బాగున్నాయి’’ అంటూ మరికొందరు మండిపడ్డారు. రీల్ అయితే ఏంటి, డ్రామా అయితే ఏంటి?, మంచిపనినే కదా ప్రచారం చేస్తున్నారంటూ మరికొందరు నెటిజర్లు సమర్థించారు.
Humanity at best❤️
A tea-seller, tired of walking through train selling hot tea, finally gives in to exhaustion & falls asleep. A policeman sees that & takes upon himself to sell tea to passengers on his behalf. On getting up, policeman gives him a hug & all money collected by… pic.twitter.com/7uPGrcRg3S
— BhikuMhatre (@MumbaichaDon) October 3, 2025
