Live in Relationship: సహజీవనం అనేది ఆధునిక సమాజంలో ఒక సాధారణ విషయంగా మారిపోయింది. అయితే, దాని చుట్టూ జరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన దారుణం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. లేడీ ఏఎస్ఐ (ASI), సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (CRPF) సహజీవనంలో ఉండగా.. ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. పూర్తి వివరాల్లోకెళితే.. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న జంట మధ్య తరచుగా జరిగే గొడవలు చివరికి హత్యకు దారితీశాయి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అరుణ నటూ జాదవ్ (25)ను ఆమె ప్రియుడు, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దిలీప్ దంగాచ్చియా గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం కలకం సృష్టిస్తోంది. ఈ సంఘటన, సహజీవన సంబంధాల్లో తలెత్తుతున్న సమస్యలు, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం, నేరాలకు దారితీస్తున్న పరిస్థితులపై తీవ్ర చర్చకు దారితీస్తుంది.
Read Also- Harish Rao: విద్యార్థి, యువకులతో హరీశ్ రావు స్ట్రాటజీ!
ఎందుకిలా జరిగింది?
అరుణ, దిలీప్ ఇద్దరూ సురేంద్రనగర్ జిల్లాలోని పక్క పక్క గ్రామాల వాసులు. వీరిద్దరూ 2021లో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి అంజర్‌లోని గంగోత్రి సొసైటీ-2లో ఇద్దరూ ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇరువురి మధ్య గత కొన్నిరోజులుగా పెళ్లి విషయమై గొడవలు జరుగుతున్నాయి. అది కాస్త తీవ్రం కావడంతో ఆగ్రహంతో అరుణను దిలీప్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ మీడియాకు వెల్లడించారు. శనివారం రాత్రి అంజర్‌లోని వారి నివాసంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ హత్యకు ముందు ఈ జంట సెలవులో అహ్మదాబాద్ వెళ్లి, షాపింగ్.. చిన్నపాటి టూర్‌కు వెళ్లి తిరిగొచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఊహించని ఘటన చోటుచేసుకున్నది. తాను చేసిన పనిని గ్రహించిన తర్వాత, దిలీప్ కత్తితో తన మణికట్టు కోసుకుని, ఫెనాయిల్ తాగడానికి ప్రయత్నించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, అతను వాంతులు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ట్విస్ట్ ఏమిటంటే.. ఈ ఘటన జరిగిన తర్వాత, శనివారం ఉదయం దిలీప్ దంగాచ్చియా నేరుగా అరుణ పనిచేస్తున్న అంజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే లొంగిపోవడమే. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి కుటుంబానికి సమాచారం అందించి, పోస్ట్‌మార్టంకు పంపారు. దిలీప్ జాదవ్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన ఘటనల క్రమంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. సీఎస్కే ప్లేయర్‌కు సెలక్టర్ల పిలుపు
ఇదే తరహా ఘటనలు ఎన్నో!
ఇలాంటి ఘటనలు గుజరాత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సహజీవనంలో ఉన్న భాగస్వాముల మధ్య అనుమానాలు, ఆర్థిక సమస్యలు, ఇతర సంబంధాలు, భావోద్వేగ వైరుధ్యాలు వంటివి తరచుగా హింసకు, కొన్నిసార్లు హత్యలకు దారితీస్తున్నాయి. వివాహ బంధంలో ఉన్నంత సామాజిక, చట్టపరమైన రక్షణలు లేకపోవడం కూడా ఈ సంబంధాలను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. సహజీవన భాగస్వాముల్లో ఒకరు లేదా ఇద్దరూ తీవ్ర భావోద్వేగ అస్థిరతతో బాధపడుతున్నప్పుడు, చిన్న చిన్న గొడవలు కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో, సహజీవనం పట్ల సమాజంలో ఉన్న వ్యతిరేకత లేదా కుటుంబాల అంగీకారం లేకపోవడం కూడా భాగస్వాములపై మానసిక ఒత్తిడి పెంచుతుంది. సహజీవన సంబంధాలకు సంబంధించి స్పష్టమైన చట్టాలు, రక్షణలు లేకపోవడం కూడా ఒక సమస్య. భాగస్వాముల మధ్య ఆస్తి, పిల్లల సంరక్షణ వంటి విషయాల్లో వివాదాలు తలెత్తినప్పుడు ఇది మరింత జటిలమవుతుంది. సంబంధాల్లో విశ్వాసం కొరవడినప్పుడు, అది అనుమానాలకు దారితీసి హింసకు కూడా ప్రేరేపిస్తుంది. సహజీవనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు సరైన కౌన్సెలింగ్, అవగాహన.. చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడం ద్వారా ఇలాంటి దారుణాలను నివారించవచ్చు.
Read Also- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ఎలా ఉంటుందంటే..