Crime News: వేర్వేరు కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసిన కూకట్ పల్లి పోలీసులు వారి నుంచి 30 లక్షలకు రూపాయలకు పైగా విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడు ఏటీసీ కంపెనీలో నెట్ వర్క్ ఇంజనీర్ గా పని చేస్తుండటం గమనార్హం. బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్(DCP Suresh Kumar), కూకట్ పల్లి ఏసీపీ రవికిరణ్(ACP Ravi Kiran) రెడ్డితో కలిసి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్ పల్లి(Kukatpally) బాలాజీనగర్ నివాసి ఆర్యన్ యోగేశ్ స్కూల్లో ఉన్నపుడే చదువు వదిలేశాడు. ఆ తరువాత ఆవారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.
డబ్బు కోసం కారును..
ఈ క్రమంలో డబ్బు సంపాదించటానికి తాను ఉంటున్న ప్రాంతంలోనే తెరిచి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేస్తూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక, జగద్గిరిగుట్ట నివాసి మస్సి సురేశ్(Suresh) గచ్చిబౌలిలోని ఏటీసీ కంపెనీలో నెట్ వర్క్ ఇన్ ఛార్జ్. దుర్వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం కారును అపహరించి దొరికిపోయాడు. మూసాపేట ఇందిరమ్మ కాలనీ నివాసి అల్లూరి పవన్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. జల్సాలు చేసుకోవటానికి తాను పని చేస్తున్న స్టూడియోలోనే దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐ సుబ్బారావు(CI Subarao), డీఐ కొండలరావు, క్రైం ఎస్ఐ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ నాగరాజులను డీసీపీ అభినందించారు.
Also Read: Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు
అక్రమంగా ఉంటున్న ఆఫ్రికన్ దేశస్తులు
అక్రమంగా తిష్ట వేసి ఉన్న 23 ఆఫ్రికన్ దేశస్తులను సైబరాబాద్ పోలీసులు వారి వారి దేశాలకు వెనక్కి పంపించి వేశారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా బాకారం గ్రామ సమీపంలోని ఓ ఫార్మ్ హౌస్ లో విదేశీయులు బర్త్ డే వేడుకల పేర న్యూసెన్స్ సృష్టిస్తున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 14న శంషాబాద్ ఎస్వోటీ అధికారులు, రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఉగాండా, నైజీరియా, లిబేరియా, బొత్స్వానా, కెన్యా, కామెరూన్, మొజాంబిక్, జింబాబ్వే, ఘనా, మాల్వీ దేశాలకు చెందిన 51మందిని పట్టుకున్నారు. వీరిలో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిలో 23మందిని వారి వారి దేశాలకు తిప్పి పంపించి వేశారు. మరో 9మందిని వెనక్కి పంపించటానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేస్తున్నారు.
Also Read: Upasana: ఢిల్లీ సీఏం రేఖా గుప్తాతో బతుకమ్మ ఆట.. ఉపాసన రేంజ్ చూశారా?