Keesara Man Arrested: మోజుపడి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలను కూడా కన్నాడు. ఆ తరువాత తెలిసింది భార్యాపిల్లలను పోషించుకోవటం ఎంత కష్టమన్న సంగతి. ఈ క్రమంలో కుటుంబాలను పోషించుకోవటానికి గంజాయి దందా మొదలు పెట్టిన సదరు వ్యక్తి చివరకు ఎక్సయిజ్పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కీసర ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్(Sheikh Mahboob) ఆలంకు ముగ్గురు భార్యలు ఉన్నారు. సంతానం కూడా ఉంది. చేస్తున్న పని నుంచి ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో వారిని పోషించుకోవటం తలకు మించిన భారంగా మారింది.
ఇటువంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిపై దాడి చేసిన షేక్‌మహబూబ్ ఆలంపై హత్యాయత్నం నేరారోపణలపై కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ చేసిన పోలీసులు(Police) అతన్ని జైలుకు తరలించారు. అక్కడ షేక్ మహబూబ్ ఆలంకు గంజాయి దందా చేస్తూ దొరికిపోయిన విజయవాడ వాస్తవ్యుడు తిరుపతి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది.
బెయిల్ పై విడుదలై బయటకు
ఈ క్రమంలో షేక్మహబూబ్ఆలం తాను పడుతున్న కష్టాలను తిరుపతితో చెప్పుకున్నాడు. తాను చెప్పినట్టుగా గంజాయి దందా చేస్తే తేలికగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించ వచ్చని తిరుపతి చెప్పటంతో దానికి అంగీకరించాడు. అతని ద్వారానే విజయవాడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న వారి వివరాలు తీసుకున్నాడు. బెయిల్ పై విడుదలై బయటకు రాగానే గంజాయి దందా మొదలు పెట్టాడు. తరచూ విజయవాడ వెళ్లి గంజాయి కొని తెస్తూ కీసర ప్రాంతంలోని దమ్మాయిగూడలో అమ్మటం మొదలు పెట్టాడు.
Also Read: BRS Party: స్థానిక ఎన్నికల ముందు నేతలు చేజారకుండా ప్లాన్..
ఎప్పటిలానే ఇటీవల విజయవాడ వెళ్లి గంజాయి తీసుకొచ్చి నవాబ్ఖాన్ అనే వ్యక్తికి 230 గ్రాములు అమ్మాడు. కాగా, ఘట్కేసర్ఎక్సయిజ్ సీఐ రవి, ఎస్ఐలు నందిని, సంగీతతోపాటు సిబ్బందితో కలిసి నవాబ్ఖాన్(Nawab Khan)ను అరెస్ట్‌చేసి అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో షేక్ మహబూబ్ఆలం(Sheikh Mahbub Alam) అతనికి గంజాయి అమ్మినట్టు వెల్లడి కావటంతో అతన్ని కూడా అరెస్ట్‌చేశారు. ఈ క్రమంలో షేక్మహబూబ్ఆలం ఇంటిపై దాడి జరిపిన ఎక్సయిజ్పోలీసులు 3.50లక్షల విలువ చేసే 6.420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి చర్లపల్లి జైలుకు రిమాండ్ చేశారు.
మరో పెడ్లర్అరెస్ట్
ఇక నిఘా ఎక్కువ కావటంతో అడ్డా మార్చి గంజాయి అమ్ముతున్న మరో వ్యక్తిని ఎక్సయిజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుని నుంచి 1.161 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్ పేటకు చెందిన విశాల్ సింగ్తేలికగా డబ్బు సంపాదించేందుకు చాలా రోజులుగా గంజాయి అమ్ముతున్నాడు. ఇటీవలిగా నిఘా ఎక్కువ కావటంతో అడ్డాను హైదర్ గూడ(Hyderguda)కు మార్చాడు. ఈ మేరకు సమాచారం సేకరించిన ఎస్టీఎఫ్ బీ టీం ఎస్ఐ బాలరాజు(SI Balaraju) సిబ్బందితో కలిసి దాడి చేసి విశాల్‌సింగ్ ను అరెస్ట్ చేసి అతని నుంచి గడంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి అతన్ని నారాయణ గూడ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: BRS KTR: లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ నజర్!