Shocking Case: జార్ఖండ్ రాష్ట్రం గిరిడిహ్ జిల్లా గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళల కేసు దర్యాప్తులో (Shocking Case) విస్తుగొల్పే నిజాలు బయటపడ్డాయి. అదృశ్యమైన ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. వారిద్దరి మృతదేహాలను సోమవారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని గోల్గో పహాడీ అడవిలో పోలీసులు గుర్తించారు. ఈ హత్యల వెనుక ఖర్సన్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ చౌదరీ అనే వ్యక్తి ఉన్నట్టు పోలీసులు తేల్చారు. మంగళవారం అతడిని అరెస్ట్ చేశారు. చనిపోయిన మహిళల పేర్లు సోని దేవి (23), రింకూ దేవి (31) అని, వీరిద్దరూ నీమాది అనే గ్రామానికి చెందినవారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
మృతుల్లో ఒకరైన సోని దేవికి చాలాకాలం క్రితమే పెళ్లి అయిందని, కానీ, నిందితుడు శ్రీకాంత్ చౌదరితో ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై రెండేళ్లక్రితం గ్రామంలో ఘర్షణ జరిగిందని, గ్రామంలో పంచాయితీ నిర్వహించి ఈ సంబంధం అక్రమమంటూ పెద్దలు ప్రకటించారని, శ్రీకాంత్‌కు రూ.1.7 లక్షల జరిమానా విధించారని తెలిపారు. అయినప్పటికీ, వారి సంబంధం కొనసాగుతూనే వచ్చిందన్నారు. తనతో మాట్లాడడం మానేస్తే చంపేస్తానంటూ సోనీని ఇటీవల శ్రీకాంత్ బెదిరించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read Also- Sambarla Yeti Gattu: సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి అదిరిపోయే అప్డేట్ .. ఏం ఉంది భయ్యా..
గత గురువారం, సోని దేవి, తన పొరుగింటి యువతి రింకూ దేవితో కలిసి అడవిలో ఆకులు సేకరణకు వెళ్లిందని, ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. రెండు రోజుల తర్వాత, సోని తల్లి వెళ్లి గవాన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇవ్వడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతుర్ని చంపింది శ్రీకాంత్ చౌదరిపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సోని ఫోన్‌ను కూడా పోలీసులకు ఆమె అప్పగించారు.
దర్యాప్తులో భాగంగా మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు హత్య చేసింది ఎవరో గుర్తించారు. శ్రీకాంత్ చౌదరి హతమార్చినట్టుగా పసిగట్టారు. పోలీసులు తమదైన రీతిలో ప్రశ్నించగా నిందితుడు నిజాలు ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నీమాది గ్రామానికి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న అడవిలో మృతదేహాలను గుర్తించారు.
Read Also- Sambarla Yeti Gattu: సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి అదిరిపోయే అప్డేట్ .. ఏం ఉంది భయ్యా..
గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు హత్యకు గురికావడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం, వందలాది మంది గ్రామస్థులు మృతుల కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి గవాన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. శవాలను వెతకడానికి లంచం డిమాండ్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, నిందితుడిని తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
గ్రామస్థుల ఆందోళనపై పోలీసులు స్పందించారు. గవాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, శ్రీకాంత్ చౌదరిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించామని తెలిపారు.