Crime News; నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు డ్రగ్స్ దందాపై దృష్టి సారించారు. తాజాగా మాసాబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.65 లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, పెర్నమెట్ట గ్రామానికి చెందిన ఉప్పుటూరి కార్తిక్ ఎలియాస్ అలెక్స్ (37) ఈ డ్రగ్స్ దందాకు సూత్రధారిగా వ్యవహరించాడు. పాల వ్యాపారంలో, ఆ తర్వాత గ్రానైట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో కార్తిక్ దురలవాట్లకు బానిసయ్యాడు. కొన్ని రోజుల క్రితం నేరెడ్‌మెట్‌లో పాల వ్యాపారం చేస్తున్న తన బావ చిరుమామిళ్ల బాలాజీ (32) వద్దకు కార్తిక్ వచ్చాడు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివిన బాలాజీ కూడా ఎండీఎంఏ డ్రగ్ సేవించేవాడు. ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం అదే డ్రగ్‌ను అమ్మడం మొదలుపెట్టాడు. బాలాజీ వద్దకు వచ్చిన తర్వాత కార్తిక్‌కు ఎండీఎంఏ డ్రగ్ గురించి తెలిసింది. హైదరాబాద్‌లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుసుకున్న కార్తిక్ తరచూ బెంగళూరు వెళుతూ డ్రగ్‌ను ఇక్కడికి తీసుకురావడం మొదలు పెట్టాడు.
Also Read: Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!
ఇలా దొరికిపోయాడు..
చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో గ్రాము చొప్పున ప్యాక్ చేసి, ఒక్కో ప్యాకెట్‌ను రూ.4 వేలకు అమ్మడం ప్రారంభించాడు. బాలాజీ కూడా కార్తిక్ నుంచి దీనిని కొంటూ తన నెట్‌వర్క్‌లోని వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించేవాడు. ఇక, జీడిమెట్ల వాస్తవ్యుడైన బీటెక్ విద్యార్థి తాండ్ర దీపక్ (29) కూడా ఎండీఎంఏ డ్రగ్‌ను బాలాజీ నుంచి కొంటూ, తాను వినియోగిస్తూనే ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఈ ముగ్గురు సాగిస్తున్న మాదక ద్రవ్యాల దందా గురించి సమాచారం అందడంతో, హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సీఐ బాలస్వామి, ఎస్ఐ మనోజ్‌కుమార్, మాసాబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ డీఐ శ్రీనివాసరావుతో కలిసి నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎండీఎంఏ డ్రగ్‌తోపాటు మూడు మొబైల్ ఫోన్లు, ఒక బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి మాసాబ్‌ట్యాంక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Pathang Movie: ఆశల ఎత్తులు కష్టాల లోతులు చూపించే ‘పతంగ్’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?..

