Hyderabad Double Murder: హైదరాబాద్ నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. పెళ్లి కానీ 40 ఏళ్ల మహిళ ఓ పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారన్న కోపంతో తల్లితో పాటు మతిస్థిమితం లేని అక్కను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. తొలుత తల్లి హత్య స్థానికంగా కలకలం లేపగా.. దానిని పోలీసులు విచారిస్తున్న క్రమంలో సోదరి హత్య గురించి బయటపడింది.
లాలాగూడ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. సుశీల భర్త రైల్వే ఉద్యోగి కావడంతో అతడి అకస్మిక మరణంతో ఆ జాబ్ రెండో కుమార్తె లక్ష్మీకి వచ్చింది. దీంతో సుశీల ఫ్యామిలీ అంతా 2018 వరకూ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవారు. ఆ తర్వాత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ ప్రాంతంలో సుశీల కొత్త ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యింది. లక్ష్మీకి మాత్రం రైల్వే క్వార్టర్స్ ఉండటంతో మతిస్థిమితం సరిగా లేని అక్క జ్ఞానేశ్వరితో కలిసి అక్కడే ఉండిపోయింది.
ఈ క్రమంలో కొత్త ఇంటికి వస్తూ పోతూ ఉన్న క్రమంలో జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్ (45)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అరవింద్ తో లక్ష్మీ తిరుగుతుండటం తల్లి సుశీలకు నచ్చేది కాదు. ఈ విషయంలో పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. ఇది తెలిసిన అరవింద్.. ఈ నెల 6న సుశీల ఉంటున్న కొత్త ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆపై దాడి చేయడంతో సుశీల అక్కడిక్కడే మరణించింది. తల్లితో ఉంటున్న మూడో కుమార్తె ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న సుశీల శవమై కనిపించింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అరవింద్ గోడ దూకి పారిపోతూ కనిపించాడు. దీంతో మహేశ్వరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Posani Krishna Murali: ‘నాకు గుండె జబ్బు, పక్షవాతం ఉంది’.. కోర్టు ఎదుట పోసాని ఆవేదన
రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మీతో అరవింద్ కు ఉన్న అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నారు. పరారీలో ఉన్నఅతడి ఆచూకి కోసం లక్ష్మీని ప్రశ్నించగా రెండ్రోజులు క్రితం వారు చేసిన మతిస్థిమితం లేని అక్క జ్ఞానేశ్వరి హత్య గురించి తెలిసింది. సోదరిని చంపి సంపులో మూటగట్టి పడేసినట్లు లక్ష్మీ పోలీసులకు వెల్లడించింది. దీంతో వెంటనే సంపు దగ్గరు వెళ్లిన లాలాగూడ పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన సోదరి జ్ఞానేశ్వరి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం లక్ష్మీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్నారు.