Medak Crime: భార్యపై అనుమానంతో హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్(Medak) జిల్లా టేక్మాల్ మండలం బర్ధిపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. బర్దిపూర్ గంగారం శ్రీశైలం, మంజులలు తన కుమారుడికి మధుమేహ వ్యాధి(Diabetes) గ్రస్తుడు కావడంతో చికిత్సల నిమిత్తం నాలుగు సంవత్సరాల పాటు హైద్రాబాద్(Hyderabad) ప్రాంతానికి వెళ్లారు. భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఆయన దసరా పండగ సమయంలో మకాంను బర్దిపూర్ గ్రామానికి మార్చాడు.
అనుమానమే పెనుభూతమై..
తన భార్య ఇతరులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుందని నిర్ణయించుకొని ఈ మద్యకాలంలో మద్యానికి బానిసయ్యాడు. తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ తన భార్యను చంపేస్తానని, నన్ను తలెత్తుకోలేకుండా చేస్తుందంటూ అన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీశైలం, మంజులకు ప్రవీణ్ (19) ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రికి తమ అమ్మమ్మ ఊరైన హసన్‌మహ్మద్‌పల్లికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దిండుతో ఆమె ముఖంపై పెట్టి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకోవడంతో ఈ సంఘటన జిల్లాలో సంచలనం లేపింది. శ్రీశైలం, మంజులలకు 20 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. అనుమానం ఒక కుటుంబాన్ని చిదిమేసిందని చెప్పవచ్చు. శ్రీశైలం, మంజులల మతులకు సంబంధించి ఇరు కుటుంబాల సభ్యుల ఫిర్యాదు మేరకు టేక్మాల్ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

