Love Betrayal Case: ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడు
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్‌లో జరిగిన ఘటన
హుజూరాబాద్, స్వేచ్ఛ : ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో (Love Betrayal) తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ప్రియుడి ఇంటి ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పురుగుల మందు తాగబోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జగిత్యాలకు చెందిన రజిత (25), హుజూరాబాద్ పట్టణానికి చెందిన సుంకరి వినయ్ (30) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వినయ్ తండ్రి సుంకరి ఐలయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వినయ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో రజిత కూడా కాంపౌండర్‌గా పనిచేస్తోంది.
ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇటీవల వినయ్‌కు కుటుంబ పెద్దలు వేరే అమ్మాయితో వివాహ నిశ్చయించారు. ఈ విషయం రజితకు తెలియడంతో, ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. తనను ప్రేమించి, ఇప్పుడు పెళ్లి చేసుకోబోనని చెప్పడంతో మనస్తాపం చెందింది. ఆదివారం హుజూరాబాద్‌లోని ప్రియుడు వినయ్ ఇంటికి వెళ్లి, తనను మోసం చేశాడంటూ ఆక్రోశించింది. అనంతరం అక్కడే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగడానికి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ క్రమంలో రజితను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, రజితను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యువతిని ఆసుపత్రికి తరలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన హుజూరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.
