Model Sheetal Choudhary: హర్యానా మోడల్ షీతల్ చౌదరి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. షీతల్ ను తానే హత్య చేసినట్లు ఆమె బాయ్ ఫ్రెండ్ సునీల్ నేరాన్ని అంగీకరించాడు. అయితే షీతల్ కు అప్పటికే పెళ్లి కాగా.. ఆమెకు 5 నెలల బిడ్డ కూడా ఉంది. మరోవైపు నిందితుడు సునీల్ కు సైతం గతంలోనే వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలుత ఆమెది కారు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ.. శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో హత్యగా పోలీసులు నిర్ధారించారు. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా సునీల్ నిజస్వరూపం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే..
జూన్ 14న పానిపట్ లోని అహర్ గ్రామంలో ఆల్బమ్ షూటింగ్ కోసం షీతల్ వెళ్లింది. రాత్రి 10:30 ప్రాంతంలో సునీల్ ఆ గ్రామానికి వెళ్లి షీతల్ ను సర్ ప్రైజ్ చేశాడు. ఇద్దరూ కారులో కూర్చొని మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్ర రూపం దాల్చడంతో షీతల్ వెంటనే తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసింది. సునీల్ తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షీతల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.
ప్రియుడి.. కట్టుకథ!
అయితే జూన్ 15న సునీల్ కారు.. పానిపట్ లోని ఓ కాలవలో లభించింది. ఈలోపు ఆస్పత్రికి చేరుకున్న సునీల్.. తన కారు కాలవలో పడిపోయిందని పోలీసులకు చెప్పాడు. షీతల్ కారుతో పాటే నీటిలో మునిగిపోయిందని పేర్కొన్నాడు. తాను మాత్రం ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జూన్ 16న షీతల్ మృతదేహం లభ్యమవ్వగా ఆమె గొంతు కోసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శరీరంలో కత్తిపోట్లను సైతం కనుగొన్నారు.
Also Read: Genelia Marriage: ఆ స్టార్ హీరోతో జెనీలియా సీక్రెట్ పెళ్లి.. 14 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన నిజం.. అతనెవరంటే?
పెళ్లికి నిరాకరిచిందనే?
దీంతో సునీల్ చౌదరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా షీతల్ ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే షీతల్ – సునీల్ మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సునీల్ కు కర్నాల్ ప్రాంతంలో ఓ హోటల్ ఉందని.. గతంలో షీతల్ అక్కడ పనిచేసిందని పేర్కొన్నారు. షీతల్ వద్దకు పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అప్పటికే సునీల్ కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో ఆమె తిరస్కరించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే షీతల్ ను సునీల్ హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.