Minor Girl Case: కాలం గడుస్తున్నా, కఠిన చట్టాలు ఎన్ని తీసుకొస్తున్నా కొందరు ‘మృగాళ్ల’ పాడుబుద్ధులు ఏమాత్రం మారడం లేదు. దీంతో, ఆడపిల్లలు, మహిళల భద్రత గాలిలో దీపంగానే ఉంటోంది. ప్రతిరోజూ భయంతోనే బతకాల్సి వస్తోంది. ప్రలోభపెట్టి కొందరు, బెదిరింపులకు పాల్పడి మరికొందరు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం వెలుగుచూసింది. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి. కానీ, ఓ తండ్రి… తన కొడుకుతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అవకాశం కల్పిస్తామంటూ ఓ బాలికను వంచించి, ఇద్దరూ కలిసి మానభంగానికి (Minor Girl Case) పాల్పడ్డారు. నేరానికి పాల్పడ్డ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సబ్‌స్కైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా హరోవా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిందితుల యూట్యూట్ ఛానల్‌కు 4.3 మిలియన్ల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ప్రధాన నిందితుడి పేరు అరబిందు మండల్ అని, 48 ఏళ్ల వయసున్న ఇతను ఒక యూట్యూబర్ అని పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడిగా ఉన్న అతడి కొడుకు మైనర్ అని, ఆదివారం ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి 15 ఏళ్ల వయసున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వివరించారు. కామెడీ, డాన్స్ రీల్స్‌లో నటించేందుకు అవకాశం ఇస్తామంటూ బాలికను నమ్మించారని, మోసపూరిత మాటలు చెప్పి ఆమెపై పలుమార్లు దారుణాలకు ఒడిగట్టారని వివరించారు.
బాలిక తండ్రి ఫిర్యాదులో వెలుగులోకి
బాధిత బాలిక తండ్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. కోల్‌కతాలో విధులు నిర్వహిస్తున్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారికంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టులో హజరుపరచగా, ప్రధాన నిందితుడు అరబిందు మండల్‌ను 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక మైనర్ నిందితుడిని జువైనైల్ హోమ్‌కి తరలించారని ఆదేశించింది.
Read Also- PCC Mahesh Kumar Goud: ఖాళీగా ఉన్న కేంద్ర రాష్ట్ర పోస్టులను భర్తీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్
కాగా, నిందితులు కొంతకాలం క్రితమే 9వ తరగతి చదువుతున్న బాధిత బాలికతో చనువు పెంచుకోవడం మొదలుపెట్టారు. తమతో కలిసి షార్ట్ వీడియోలు తీయాలంటూ కోరారు. ఈ క్రమంలో ఆమెను ప్రలోభపెట్టారు. వాళ్ల మాటలు నమ్మిన బాలిక షూట్లకు వెళుతుండేదని, ఈ క్రమంలోనే మానభంగానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలిక దుస్తులు మార్చకునే సమయంలో, ఆమెకు తెలియకుండా రహస్యంగా కెమెరాలు అమర్చి ఫొటోలు, వీడియోలు తీశారన్నారు. ఆ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడేవారని, పదేపదే రాక్షస ఆనందం పొందారని, ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. అంతేకాదు, మైనర్ నిందితుడు బాలిక తలపై సింధూరం పెట్టి, తాను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి, లైంగిక దాడి చేసినట్టు పోలీసులు వివరించారు.
Read Also- BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!
నిందితుడు అరబిందు మండల్ తెలిసిన వ్యక్తి కావడంతో బాధిత కుటుంబ సభ్యులు నమ్మారని, అందుకే బాలికను వారి వద్దకు వెళ్లనిచ్చేవారని పోలీసులు వివరించారు. తనపై జరిగిన దారుణాలను బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు వివరించారు. ఫిర్యాదు ఆధారంగా హరోవా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల ఫోన్లు, కెమెరాలు, ఇతర డివైజులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరబిందు 2 యూట్యూబ్ చానెళ్లు నడుపుతున్నాడని, ఒకదాంట్లో స్కిట్లు, షార్ట్ వీడియోల కోసం, మరొకటి హిందీ, బెంగాళీ పాటలకు డ్యాన్స్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని వివరించారు.
