Suresh Gopi: కేరళలో బీజేపీ తరపున విజయం సాధించిన మొట్టమొదటి లోక్‌సభ ఎంపీ, ప్రస్తుత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖల సహాయమంత్రి సురేశ్ గోపీ (Suresh Gopi) అనూహ్య రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారా?, ప్రధాని మోదీ కేబినెట్ నుంచి వైదొలగి, తిరిగి సినీ ఫీల్డ్‌లో అడుగుపెట్టబోతున్నారా?, అంటే దాదాపు ఖరారు అయినట్టుగానే అనిపిస్తోంది. ఆదివారం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి తన ఆదాయం బాగా తగ్గిపోయిందని, తన కుటుంబంతో పాటు మరికొందరికి అండగా నిలవాల్సి ఉందని, అందుకే డబ్బు కోసం తిరిగి పూర్తి స్థాయిలో సినిమాల్లోకి పున:ప్రవేశం చేయాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అందుకే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. కేరళలోని కన్నూరులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
తన ఆదాయం ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయిందని, కుటుంబాన్ని ఆదుకునేందుకు మళ్లీ నటించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ చెప్పారు. ఆదాయం అవసరమని, అందుకే మళ్లీ నటించాలనిపిస్తోందని ఆయన వివరించారు. మంత్రి పదవిపై పెద్దగా ఆసక్తిలేదని ఎన్నికలకు ముందే పార్టీ అధిష్టానానికి స్పష్టంగా చెప్పానని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘నటన నాకు ఆదాయం అందిస్తుంది. ఆ డబ్బులోనే కుటుంబంతో పాటు ఇంకొంతమందికి అండగా నిలుస్తున్నాను. ప్రస్తుతం ఇన్‌కమ్ అస్సలు లేదు’’ అని తన మనసులోని మాటని స్పష్టంగా చెప్పారు.
Read Also- Actress Vishnupriya: తెలుగు వాళ్ళకి అవకాశాలు వచ్చినా సీరియల్స్ చెయ్యట్లేదు.. నటి సంచలన కామెంట్స్
సదానందన్‌ను కేంద్రమంత్రి చేయండి
కేంద్రమంత్రిగా తన స్థానంలో ఆర్ఎస్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడైన సదానందన్ మాస్టర్‌ను నియమించాలని సురేశ్ గోపి సూచన కూడా చేశారు. మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నానని, తన స్థానంలో సదానందన్‌ను కేంద్ర మంత్రిగా చేయాలన్నారు. అదే జరిగితే కేరళ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి అవ్వాలని ఆశ, ఆసక్తి తనకు మొదటి నుంచీ లేవని, ఎన్నికల ముందు రోజు కూడా మీడియాతో ఇదే మాట చెప్పానంటూ సురేశ్ గోపీ గుర్తుచేసుకున్నారు. పార్టీలో తాను చిన్న వయస్కుడినే అయినప్పటికీ, ప్రజల మద్దతుతో గెలిచినందుకు గానూ అధిష్టానం తనకు మంత్రిగా అవకాశం ఇచ్చి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా, సినిమా రంగంలోనే కొనసాగాలనేది తన అభిలాష అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, సురేశ్ గోపీ 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిశూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. బీజేపీ తరపున కేరళలో తొలి ఎంపీగా ఆయన రికార్డు సాధించారు. ఎంపీగా గెలిచిన తర్వాత నటనకు దూరమయ్యారు. అయితే, పలు సందర్భాల్లో రాజకీయ జీవితంతో పాటు సినీ కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు కూడా చేశాయి. దీనిపై సురేశ్ గోపీ స్పందిస్తూ, కొందరు తన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్రని, దురుద్దేశంతోనే కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
