Eagle Team Raids: పక్కగా సేకరించిన సమాచారం మేరకు ఈగల్ టీం(Eagle Team) అధికారులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి డ్రగ్ రేవ్ పార్టీపై దాడి జరిపారు. ఈ క్రమంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 20గ్రాముల కొకైన్, 8ఎక్టసీ పిల్స్, 3గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ఒక ట్రాన్స్ పోర్టర్, ముగ్గురు వినియోగదారులు ఉన్నారు. నిందితుల్లో డిప్యూటీ తహసిల్దార్ తోపాటు మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసు నిందితులు కూడా ఉండటం గమనార్హం. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్(DCP Vineeth) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కొండాపూర్ లోని రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ తో కొందరు పార్టీ చేసుకుంటున్నట్టుగా ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులతో కలిసి దాడి జరుపగా తూర్పు గోదావరి జిల్లాకు చెంది ప్రస్తుతం ప్రగతినగర్ లో ఉంటూ డ్రగ్ పెడ్లర్ గా మారిన వ్యాపారి తేజ (28), శేరిలింగంపల్లి నివాసి, పౌల్ట్రీ వ్యాపారి, పెడ్లర్ అయిన విక్రమ్, నార్సింగి వాస్తవ్యుడు, డ్రగ్ వినియోగదారు అయిన మన్నె నీలిమ (41), డ్రగ్ ట్రాన్స్ పోర్టర్ అయిన బెంగళూరు నివాసి చందన్ (20), కొండాపూర్ నివాసి, వైన్ షాప్ వ్యాపారి పురుషోత్తం రెడ్డి, శేరిలింగంపల్లి సైబర్ మెడోస్ నివాసి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్గవ్, డ్రగ్ సప్లయర్, బెంగళూరు వాసి అయిన రాహుల్ ఎలియాస్ సోనూ పట్టుబడ్డారు.
ముగ్గురు స్నేహితులు
తేజ, విక్రమ్, నీలిమలు పాత స్నేహితులు. చాలా రోజులుగా ఈ ముగ్గురు కొకైన్ పార్టీలకు అలవాటు పడ్డారు. బెంగళూరుకు వెళ్లినపుడు పరిచయం అయిన రాహుల్ నుంచి తేజ(Teja) తరచూ కొకైన్ తీసుకు వచ్చేవాడు. మొదట్లో రాజమండ్రిలో డ్రగ్ పార్టీలు చేసుకున్న ఈ ముగ్గురు ఆ తరువాత హైదరాబాద్(Hyderabad) వచ్చి అదే అలవాటును కొనసాగిస్తూ వచ్చారు. డ్రగ్ పార్టీలు చేసుకోవటానికి సర్వీస్ అపార్ట్ మెంట్ లను అద్దెకు తీసుకునేవారు. కొకైన్ కొనటానికి అవసరమయ్యే డబ్బును అందరూ కలిసి ఇచ్చేవారు. దానిని తేజ తనకు డ్రగ్ సప్లయ్ చేస్తూ వస్తున్న రాహుల్ చెప్పిన అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసేవాడు.
Also Read: BRS Party: ప్రజా సమస్యలపై స్పందన కరువు.. సమస్యలపై కమిటీ సైలెంట్?
‘మల్నాడు’ నిందితుని దోస్త్
ఇక, డ్రగ్ రేవ్ పార్టీ చేసుకుంటూ దొరికిన విక్రమ్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు సూర్యతోపాటు డ్రగ్ సప్లయర్ రాహుల్ స్నేహితుడు. జనవరి 1వ తేదీన తన మరో మిత్రుడైన చిశ్తీతో కలిసి కారులో ఢిల్లీ వెళ్లిన విక్రమ్ నైజీరియాకు చెందిన పెడ్లర్ నుంచి 12గ్రాముల కొకైన్ కొని తిరిగి వస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే, రాహుల్(Rahul) ఓ పోలీస్ అధికారి కొడుకు కావటంతో డిచ్ పల్లి పోలీసులు అతను పరారీలో ఉన్నట్టుగా రికార్డుల్లో రాసి వదిలేశారు. మల్నాడు రెస్టారెంట్ కేసులో అరెస్టయిన తరువాత విషయం వెలుగు చూడటంతో ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసి రాహుల్ ను అదుపులోకి తీసుకున్నారు.
కింగ్ పిన్ తేజ
పట్టుబడ్డ ఆరుగురు నిందితుల్లో తేజ కింగ్ పిన్ గా ఉన్నాడు. రాహుల్ నుంచి కొకైన్ కొంటూ తరచూ డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. డిసెంబర్ 31న డిప్యూటీ తహసిల్దార్ గా పని చేస్తున్న మణిదీప్ తో కలిసి గోవాలో డ్రగ్స్ తో రేవ్ పార్టీ జరుపుకొన్నాడు. దీనికి తేజ, నీలిమలను కూడా పిలుచుకున్నాడు. ఇక, తేజ, నీలిమ, విక్రమ్ లు రాజమండ్రిలో మణిదీప్ కు చెందిన ఫార్మ్ హౌస్ లో కూడా పలుమార్లు డ్రగ్ పార్టీలు చేసుకున్నారు.
చర్మ సౌందర్యం కోసం
ఇక, పోలీసులు జరిపిన విచారణలో తేజ తన చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు గ్లూటాక్స్ అనే ఇంజక్షన్లు తీసుకుంటుంటాడని వెల్లడైంది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు 40వేల రూపాయలను తెలిసింది. అయితే, బెంగళూరులో ఇది 11వేలకే దొరుకుతుండటంతో రాహుల్ ద్వారా వాటిని తెప్పించుకునే వాడని వెల్లడైంది. ఇంజక్షన్లు పంపించిన ప్రతీసారి రాహుల్ అదే డబ్బాలో కొకైన్ కూడా పంపించే వాడని నిర్ధారణ అయ్యింది. కొన్నిసార్లు డీటీడీసీ కొరియర్ ద్వారా కూడా డ్రగ్స్ ను పంపించినట్టుగా తేలింది. పట్టుబడ్డ అందరికీ టెస్టులు జరిపించగా ఒక్క చందన్ మినహా మిగిలినవారు డ్రగ్స్ వాడుతున్నట్టు నిర్ధారణ అయ్యిందని డీసీపీ వినీత్ తెలిపారు. డ్రగ్స్ దందా చేస్తున్నవారు…వాటిని వినియోగిస్తున్న వారి గురించి తెలిస్తే 1908 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. 8712671111 నెంబర్ కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు. tsnabho-hyd@tspolice.gov.in కు మెయిల్ కూడా చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపారు.
Also Read: Telangana Politics: ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు.. స్పీకర్ 5 గురికి నోటీసులు?