Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ సైబర్ మోసం జరిగింది. 85 ఏళ్ల వృద్ధుడ్ని పోలీసుల పేరుతో బెదిరించి ఏకంగా రూ.9 కోట్లను దోచేశారు. ఉగ్రవాదులతో లింకప్, మనీలాండరింగ్ వంటి అభియోగాలతో వృద్ధుడ్ని బెదిరించిన సైబర్ నేరస్తులు.. అతడి నుంచి పలుమార్లు నగదు బదిలీలు జరిపించుకున్నారు. చివరికీ మోసపోయానని గ్రహించిన వృద్ధుడు అసలైన పోలీసులను ఆశ్రయించడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు ముంబయిలోని థాకుర్ద్వార్ లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. పెద్ద కుమార్తె తనతో జీవిస్తుండగా.. చిన్న కూతురు అమెరికాలో నివసిస్తోంది. అయితే 2025 నవంబర్ 28న బాధితుడి మెుబైల్ కు ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను నాసిక్‌లోని పంచవటి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ దీపక్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్ కార్డు ఉపయోగించి ఒక బ్యాంక్ ఖాతా తెరిచారని, ఆ ఖాతా నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి నిషేధిత సంస్థకు డబ్బు పంపించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ, సిట్ బృందాలు దర్యాప్తు సైతం ప్రారంభించాయని వృద్ధుడికి తెలిపాడు. త్వరలోనే మీపై కూడా కేసు నమోదు అవుతుందని బెదిరించాడు.
డిజిటల్ అరెస్టు పేరుతో..
కాల్ వచ్చిన కొద్దిసేపటికే వృద్ధుడికి వాట్సప్ లో వీడియో కాల్ వచ్చింది. పోలీస్ యూనిఫాం ధరించిన ఓ వ్యక్తి అందులో మాట్లాడుతూ విచారణకు సహకరిస్తే నిజమైన నిందితులను పట్టుకుంటామని నమ్మకం కలిగించాడు. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ-దర్యాప్తు జరుగుతోందని కాబట్టి పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు. అయితే ఆధారాలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో తాత్కాలికంగా మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు నమ్మించాడు. ఈ విషయాన్ని బంధువులు, స్నేహితులు ఎవరితోనూ చెప్పకూడదని హెచ్చరించాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధిత వృద్ధుడు ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యారు. బ్యాంక్ ఖాతా వివరాలు, షేర్ మార్కెట్ పెట్టుబడులు, ఫిక్స్ డ్ డిపాజిట్ సమాచారాన్ని సైబర్ నేరస్తులకు ఇచ్చేశారు.
Also Read: IndiGo Crisis: ఇండిగో సంక్షోభం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రెండు కొత్త ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్
పలు దఫాలుగా రూ.9 కోట్లు జమ
సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోని డబ్బంతా కోర్టులో జమ చేయాల్సి ఉంటుందని వృద్ధుడ్ని నమ్మించారు. దర్యాప్తు పూర్తైన వెంటనే వడ్డీతో సహా నగదు మెుత్తం ఇస్తామని నమ్మబలికారు. దీంతో బాధితుడు తన సేవింగ్స్, పెట్టుబడులను డిసెంబర్ 7 -17 మధ్య సైబర్ నేరస్థులు సూచించిన బ్యాంక్ ఖాతాలకు తరలించారు. మెుత్తం రూ.9 కోట్ల వరకూ నగదును మళ్లించాడు. 2025 డిసెంబర్ 22న మోసగాళ్లు మరో రూ.3 కోట్లు వేరే ఖాతాకు బదిలీ చేయాలని బాధితుడిని కోరగా.. అతడు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. అతడి లావాదేవీలు అనుమానస్పదంగా ఉండటంతో వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు కుటుంబ సభ్యులు వృద్ధుడి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా మోసపోయినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

