తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cyber Criminals Fraud: ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఇటీవలిగా బడా కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. ఆయా కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి డీపీలతో ఉద్యోగులకు వాట్సాప్ మెసెజీలు పెట్టి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇటీవలిగా ఈ తరహా నేరాలు అధికమైన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ బహుపరాక్ అని హెచ్చరిస్తున్నారు. కంపెనీ ఛైర్మన్ అని ఎండీ అని ఎవరైనా వాట్సాప్ మెసెజీలు పంపించి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయమంటే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాట్సాప్ డీపీ మెసెజ్
హైదరాబాద్ ల ఉన్న ఓ ప్రముఖ సంస్థలో అకౌంటెంట్ గా పని చేస్తున్న ఉద్యోగికి పదిహేను రోజుల క్రితం ఆ సంస్థ సీఎండీ డీపీతో వాట్సాప్ మెసెజ్ వచ్చింది. అందులో కొత్త ప్రాజెక్టు కోసం అర్జంటుగా 1.95 కోట్లు అవసరమని, ఫలానా ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఉంది. ప్రొఫైల్ లో ఉన్న ఫోటో చూసి సీఎండీయే ఆ మెసెజీ పంపించి ఉంటారని భావించిన అకౌంట్స్ ఆఫీసర్ నగదును ఆయా ఖాతాల్లోకి బదిలీ చేశాడు. నగదు ట్రాన్స్ ఫర్ అయినట్టు తన ఫోన్ కు మెసెజీలు రావటంతో కంగారు పడ్డ సంస్థ సీఎండీ వెంటనే అకౌంట్స్ ఆఫీసర్ తో మాట్లాడగా జరిగింది మోసమని స్పష్టమైంది. గడిచిన మూడు నెలల్లోఈ తరహా మోసాలు నాలుగైదు వెలుగు చూడటం గమనార్హం.
డేటాను కొని
ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ వేర్వేరు మార్గాల్లో ముందుగా ఫోన్ నెంబర్లను వేర్వేరు మార్గాల్లో కొని ఆ తరువాత నేరాలకు పాల్పడుతున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల్లోని కస్టమర్ కేర్ విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందికి డబ్బు ఆశ చూపించి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారన్నారు. దాంతోపాటు ఆ ఫోన్ నెంబర్లు కలిగి ఉన్నవారి వివరాలు మొత్తం తీసుకొంటున్నారని చెప్పారు.
Also Read: Heatwave Alert In TG: బయటికి వెళ్లారో.. తస్మాత్ జాగ్రత్త.. ఈ హెచ్చరిక మీకోసమే!
ఆ తరువాత పెద్ద పెద్ద కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి ఫోటోలను సోషల్ మీడియా నుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం ఆ ఫోటోలను డీపీలుగా పెట్టి ఆయా కంపెనీల్లో పని చేస్తున్న అకౌంట్స్ ఆఫీసర్లకు వాట్సాప్ మెసెజీలు పెడుతున్నారని తెలిపారు. వచ్చిన మెసెజీలో తమ బాస్ ల ఫోటోలు ఉండటంతో వాటిని నిజమే అని నమ్ముతున్న అకౌంట్స్ ఆఫీసర్లు ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు చెప్పారు. డబ్బు బదిలీ అయినట్టు బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్ లు వచ్చిన తరువాతగానీ జరిగింది మోసమని గ్రహించ లేకపోతున్నారన్నారు.
క్రాస్ చెక్ చేసుకోవాలి
ఇలా వచ్చే వాట్సాప్ మెసెజ్ లను అస్సలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ చెబుతున్నారు. మెసెజ్ వస్తే వెంటనే ఫోన్ చేసి అది నిజంగా తమ పైవారు పంపించారా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా ఇలా జరుగుతున్న మోసాలపై అకౌంట్స్, ఫైనాన్స్, హెచ్ ఆర్, అడ్మి న్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు.
ఇలాంటి మెసెజ్ లు వస్తే నగదును ట్రాన్స్ ఫర్ చెయ్యకుండా 1930 కి సమాచారం అందించాలన్నారు. ఒకవేళ నగదును బదిలీ చేసినా మొదటి గంటలోపే ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడు నగదు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
Also Read: Ganja Seized: ఆ జిల్లాలో గంజాయి దహనం.. విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!