Kadapa Crime: అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ నేపథ్యంలో చిత్రీకరించి, ఇటీవలే రిలీజ్ చేసిన ‘హత్య’ సినిమాపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులపై పులివెందుల పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. ఈ సినిమాలో తనతో పాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని సునీల్ పేర్కొన్నాడు.
హత్య సినిమాలోని సన్నివేశాలను పవన్ కుమార్ అనే వ్యక్తి వైసీపీ వాట్సప్ గ్రూపులలో వైరల్ చేస్తున్నాడని ఫిర్యాదులో సునీల్ పేర్కొన్నాడు. తన ఇంటి వద్ద కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ప్రస్తావించాడు. శనివారం సాయంత్రం పులివెందుల పోలీస్ స్టేషన్‍కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో, బీఎన్‍ఎస్, ఐటీ యాక్టు 67 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. ‘వైఎస్ అవినాష్ అన్న యూత్’ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్‍ను ఏ1గా చేర్చారు.
వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్‍ను ఏ2గా చేర్చారు. హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్‍తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వివరించారు. పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. కాగా, తనకు ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీకి సునీల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Also Read: YCP – I PAC: ఐప్యాక్ సేవలకు వైసీపీ గుడ్ బై? ముంచిందా? మించిందా?
ఎస్పీని కలిసి సతీష్ రెడ్డి..
కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి శనివారం కలిశారు. పవన్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఎస్పీతో మాట్లాడారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలో సన్నివేశాలు ఎక్కడైనా వైరల్ చేయవచ్చని అన్నారు. అన్యాయంగా పవన్ కుమార్‌ను అరెస్టు చేశారని, ఈ అరెస్ట్ దారుణమని విమర్శించారు. అన్ని విషయాలనూ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చామని, ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించి సరైన రీతిలో దర్యాప్తు చేయిస్తానంటూ హామీ ఇచ్చారని సత్తీష్ రెడ్డి వివరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు