YCP – I PAC: ‘ఐ ప్యాక్’ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి సేవలకు వైసీపీ ఇక చాలు అనుకున్నట్లేనా? అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వద్దు బాబోయ్ అని పక్కనెట్టేసినట్లేనా? కొన్ని అనివార్య కారణాలతో ఇక వద్దని పార్టీ భావించిందా? అంటే తాజా పరిణామాలను, సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, కొందరు నేతలు చేస్తున్న హడావుడిని బట్టి చూస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. వైసీపీకి ఎనలేని సేవలు అందించి, 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి ఐప్యాక్ పాత్ర ఎంతో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ ఐప్యాక్ చూసుకుంటూ ఉండేది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే చేతుల్లో పురుడు పోసుకున్న ఈ సంస్థ దేశంలో ఎన్నో పార్టీలకు సేవలు అందించింది. ఇందులో గ్రాండ్ సక్సెస్ అయినవి ఉన్నాయి, అట్టర్ ప్లాప్‌లు కూడా అంతకుమించే ఉన్నాయి. అయితే పీకే రాజకీయంగా రాణించాలని టీమ్ నుంచి బయటికి వెళ్లిపోగా ఆ తర్వాత కూడా ఈ సంస్థ సేవలను వైసీపీ వినియోగించుకుంటూ వస్తోంది. ఇలా దాదాపు పదేళ్లకు పైగానే ఐ ప్యాక్-వైసీపీల మధ్య కొనసాగిన బంధానికి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెగదెంపులు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇకపైన కూడా ఐప్యాక్ సేవలు వద్దని గట్టిగానే ఫిక్సయినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకు.. ఏమైంది.. సజ్జల సంగతేంటి?
వాస్తవానికి వైసీపీతో పాటు టీడీపీకి కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చిన రాబిన్ శర్మ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటికీ ఇంచుమించూ ఐప్యాక్ నుంచి వచ్చిన టీమ్ కావడంతో ఎక్కడో చిన్నపాటి పొరపచ్చాలు వచ్చాయని, అందుకే ఈ విషయంలో బాగా ఇబ్బందిగా భావించిన వైసీపీ ఇక ప్యాకప్ చెప్పేసిందని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు బంధాన్ని, ఇప్పటి వరకూ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లుగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ కార్యకర్తలు మాత్రం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చి తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఫుల్ జోష్‌తో పనిలో పనిగా వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కనపెడితే ప్రశాంతంగా పార్టీని నడుపుకోవచ్చని కార్యకర్తలు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ మధ్యనే కోటరీ అంటూ బాంబ్ పేల్చడంతో ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ప్రజా దర్బార్ నిర్వహించడానికి తాడేపల్లి ప్యాలెస్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఫొటోలు కూడా బయటికొచ్చాయి.
Also Read: AP Politics: మళ్లీ వైసీపీలోకి హీరో మహేష్ బాబాయి?
దీనికితోడు సజ్జల కూడా సాయిరెడ్డి కామెంట్స్ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించకపోవడంతో దాదాపు ఆయన్ను సైడ్ చేయడానికే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిక్సయ్యారని ప్రచారం జరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందో, అభిమానులు, కార్యకర్తల కోరిక ఏ మాత్రం నెరవేరుతుందో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ఇక్కడ క్లిక్ చేయండి