AP Penamaluru Tragedy: కుటుంబ పోషణకు ఓ తండ్రి పడే కష్టం అంతా ఇంతా కాదు. భార్య, బిడ్డల సంతోషమే తన ఆనందంగా భావించి తండ్రి అహర్నిశలు శ్రమిస్తుంటారు. వారి చిరునవ్వుల్లోనే తన సంతోషాన్ని వెతుక్కుంటాడు. తనకు కనీస సౌఖర్యాలు లేకపోయినా.. తనవారి యోగక్షేమాలకు లోటు లేకుండా చూసుకునేందుకు ఆ తండ్రి ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా పిల్లలపై ఓ తండ్రి చూపే ప్రేమ.. అనీర్వచనీయమైంది. అటువంటిది.. ఓ తండ్రి తన కుమారుడి పాలిట యమపాశమయ్యాడు. తన చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డను చంపుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రికి వచ్చిన కష్టమేంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
ఏపీలోని పెనమూరు నియోజకవర్గం యనమలకుదురులో వేమిరెడ్డి సాయి ప్రకాష్ రెడ్డి (33) నివసిస్తున్నాడు. వినోద్ పబ్లిక్ స్కూల్ లోని ఓ అపార్ట్ మెంట్లో భార్య లక్ష్మీ భవానీ, కుమార్తె తక్షిత, కుమారుడు తక్షిత్ (7) కలిసి జీవిస్తున్నాడు. విజయవాడ పాతబస్తీలో బంగారు అభరణాల వ్యాపారం చేస్తూ.. సాయి ప్రకాష్ తన కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉండేవాడు. అంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని కరోనా రక్కసి చిదిమేసింది. వ్యాపారం పూర్తిగా డీలాపడిపోవడంతో అప్పులపాలయ్యాడు.
మానసిక క్షోభ..
అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో గత కొంతకాలంగా సాయి ప్రకాష్ రెడ్డి.. మనశాంతి లేకుండా జీవిస్తున్నాడు. అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించుకోలేక తనలో తానే తెగ మదనపడేవాడు. అయితే సాయి ప్రకాష్ రెడ్డి బాధ చూడలేక.. బంధువులు తలో చేయి వేసి కొంత వరకూ అప్పుతీర్చారు. తీర్చాల్సింది ఇంకా కొండంత ఉండటంతో సాయి ప్రకాష్ మదన పడిపోయాడు. ఈ విషయాన్ని భార్య లక్ష్మీ భవానితో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డాడు. దీంతో భర్తకు ఆమె ధైర్యం చెప్పి.. పలుమార్లు ఓదార్చింది.
బిడ్డను చంపి.. సూసైడ్
ఈ క్రమంలోనే ఈ నెల 9న సాయంత్రం భార్య లక్ష్మీ బయటకు వెళ్లింది. ఇంటివద్దనే బాధలో ఉన్న సాయి ప్రకాష్ రెడ్డికి.. ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. తన ఏడేళ్ల కుమారుడు తక్షిత్ కు ఐస్ క్రీమ్ లో సెనేడ్ పెట్టి ఇచ్చాడు. ఆపై తానూ దానిని తిన్నాడు. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ అచేతన స్థితితోకి వెళ్లిపోయారు. అప్పుడే బయట నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు.. వారిద్దరని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే తండ్రి, కొడుకులు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తను వెళ్తూ ఏడేళ్ల బిడ్డను తీసుకెళ్లడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Hyderabad: హైద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ యువతీ అక్కడికక్కడే మృతి
ఫోన్ లో చేరవేత
అయితే తాను చనిపోతున్న విషయాన్ని సన్నిహితుడైన విజయ్ కు సాయి ప్రకాష్ రెడ్డి సెల్ ఫోన్ ద్వారా చెప్పారు. తక్షిత్ తాను సైనైడ్ తీసుకున్నట్లు అతడికి చెప్పాడు. దీంతో అతడు వెంటనే బంధువులను అప్రమత్తం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. భర్త, కుమారుడి మృతితో భార్య లక్ష్మీ భవాని కన్నీరు మున్నీరు అవుతోంది. కుమార్తెతో ఇకపై తాను ఎలా జీవించాలంటూ రోధిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.