- మురళీధర్ రావు లీలలు అన్నీ ఇన్నీ కావు
- ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిజాలు
- మొత్తం 10 చోట్ల తనిఖీలు
- భారీగా అక్రమాస్తుల గుర్తింపు
- రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా
- కొనసాగుతున్న తనిఖీలు
- సబ్ కాంట్రాక్టుల కేటాయింపులలో భారీగా అవినీతి
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక స్థానాల్లో పని చేసి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్న అధికారుల బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. విజిలెన్స్ నివేదికలో ఉన్న పేర్ల ఆధారంగా ఒక్కొక్కరిపై వరుసగా దాడులు చేస్తున్నారు. తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పని చేసి రిటైరైన మురళీధర్ రావు అవినీతి పుట్టను పగులగొట్టారు. వేర్వేరు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బంజారాహిల్స్‌లోని మురళీధర్ రావు నివాసంతోపాటు కరీంనగర్, జహీరాబాద్, హైదరాబాద్‌లలోని ఆయన బంధుమిత్రుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భారీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం.
కాళేశ్వరం నిర్మాణంలో కీలకం
కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్ రావు ఈఎన్సీగా పని చేశారు. ఆయన సంతకం చేయనిదే బిల్లులు పాసయ్యేవి కావు. పనులు సక్రమంగా పూర్తి చేశారా లేదా అన్నది నిర్ధారించుకున్న తరువాతే మురళీధర్ రావు సంతకాలు చేయాల్సి ఉంది. పనులు సక్రమంగా జరగలేదని తెలిస్తే బిల్లులను ఆపేసే అధికారం కూడా ఆయనకు ఉండేది. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడినట్టుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. పైగా, తన కొడుకు అభిషేక్ రావు, హర్షవర్ధన్ రెడ్డిల పేరన ఉన్న ఓ కంపెనీకి పాలమూరుతోపాటు కాళేశ్వరంలో పలు సబ్ కాంట్రాక్టులు ఇప్పించినట్టుగా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సమర్పించిన తమ నివేదికలో సిఫార్సు చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం బంజారాహిల్స్‌లోని మురళీధర్ రావు ఇంటితోపాటు జహీరాబాద్, కరీంనగర్, హైదరాబాద్ లలోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు. మంగళవారం రాత్రి వరకు తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.
Read Also- Kaleswaram: మాజీ ఈఎన్సీల కమీషన్లపై ఏసీబీ ఫోకస్
కూడబెట్టుకున్న ఆస్తులివే..
మురళీధర్ రావు అతని బంధుమిత్రుల నివాసాల్లో జరిపిన తనిఖీల్లో బయటపడ్డ ఆస్తుల డాక్యుమెంట్లు చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. అధికారులు చెప్పిన ప్రకారం మురళీధర్ రావుకు కొండాపూర్‌లో ఓ విల్లా ఉంది. బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. ఇక, కరీంనగర్‌లో ఓ కమర్షియల్ బిల్డింగ్, హైదరాబాద్‌లో మరో కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్టుగా బయటపడింది. కోదాడలో ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉన్నట్టుగా తేలింది. జహీరాబాద్‌లో 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టుగా స్పష్టమైంది. వరంగల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను కట్టిస్తున్నట్టుగా తేలింది. 11 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు డాక్యుమెంట్లు దొరికాయి. హైదరాబాద్‌లో ప్రైమ్ ప్రాంతాల్లో 4 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నట్టుగా పత్రాలు లభించాయి. మోకిలాలో మరో 6,500 గజాల ప్లాట్ ఉన్నట్టుగా తేలింది. మూడు ద్విచక్ర వాహనాలు, ఓ మెర్సిడిజ్ కారు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో బంగారు నగలు, డిపాజిట్లు ఉన్నట్టుగా తేల్చారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు మురళీధర్ రావుపై అక్రమాస్తుల కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి ఆయనను రిమాండుకు తరలించనున్నారు. దాడులు కొనసాగుతున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
రిటైరైనా కొనసాగింపు
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే మురళీధర్ రావు పదవీ విరమణ పొందారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని 13 సంవత్సరాలపాటు పొడిగించింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అందిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించింది.
Read Also- Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?