Blast in Shadnagar Glass Factory
క్రైమ్

Hyderabad : కంప్రెషర్ పేలుడు.. సీఎం దిగ్ర్భాంతి

– షాద్ నగర్‌లో విషాదం
– గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు
– ఆరుగురి మృతి
– 15 మందికి తీవ్ర గాయాలు
– పేలుడు ధాటికి ఛిద్రమైన శరీరాలు
– వెంటనే స్పందించిన సీఎం.. అధికారులకు ఆదేశాలు

Blast in Shadnagar Glass Factory : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కంప్రెషర్ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కార్మికుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లే ఉన్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది దాకా కార్మికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

సీఎం స్పందన

షాద్ న‌గ‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. విషయం తెలిసిన వెంటనే, ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్య చికిత్స‌లు అందించాల‌ని ఆదేశించారు. ప్ర‌మాద స్థ‌లిలోనే ఉన్న క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, ప‌రిశ్ర‌మ‌లు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థ‌లిలోనే ఉండి స‌మ‌న్వ‌యంతో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.