Ramesh Rathod passed away
క్రైమ్

Telangana: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

– ఆదిలాబాద్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత
– టీడీపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీ ఛైర్మన్‌గా సేవలు
– సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నివాళి

Adilabad ex MP  belonged to bjp Ramesh Rathod passed away: ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఉట్నూరులోని తన నివాస గృహంలో రక్తపోటు నిల్వలు పడిపోయి స్పృహ తప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2006 – 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ తో సహా పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.

రమేష్‌ రాథోడ్‌ మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్‌ దిగ్భ్రాంతి

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’అని సంతాపం తెలిపారు.