– కవిత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు
– రెండు బెయిల్ పిటీషన్ల కొట్టివేత
– సుప్రీం మెట్లేక్కే ఆలోచనలో కవిత
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. సోమవారం ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా అరెస్టైన కవిత గత మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కవిత తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్ కోరుతూ గతంలో 2 వేర్వేరు పిటిషన్లను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేయగా.. విచారించిన ఆ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఆమె దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవితను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారని కవిత తరఫు న్యాయవాదులు వాదించారు. తర్వాత ఈడీ, సీబీఐ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి మాత్రమే కాదనీ, ఆమె సూత్రధారి కూడా అనీ, కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కనుక ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ బెయిల్ ఇవ్వటానికి నిరాకరిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.