What Will KCR Sir Say? Deadline Ends Today
Top Stories, క్రైమ్

Hyderabad: కేసీఆర్‌కు చుక్కెదురు.. త్వరలోనే పవర్ కమిషన్ ముందుకు!

  • కేసీఆర్‌ పిటీషన్‌ను కొట్టేసిన హైకోర్టు సీజే ధర్మాసనం
  • విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ పిటీషన్‌లో పేర్కొన్న కేసీఆర్
  • విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ పేర్కొన్న ధర్మాసనం
  • కమిషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొట్టివేయాలన్న కేసీఆర్
  • జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నోటీసులు రద్దు చేయాలన్న కేసీఆర్‌ న్యాయవాదులు
  • నిబంధన మేరకే విద్యుత్‌ కమిషన్‌ వ్యవహరిస్తోందన్న అడ్వకేట్‌ జనరల్‌
  • కేసీఆర్‌ వేసిన పిటిషన్‌ను విచారణార్హత లేదన్న అడ్వకేట్‌ జనరల్
  • కేసీఆర్ తరఫు న్యాయవాదుల వాదనతో విభేదించిన హైకోర్టు

Telangana HC dismisses former CM KCR’s petition against Narasimha Reddy Commission

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. యాదాద్రి ,భద్రాద్రి, ఛత్తీస్ గడ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహ రెడ్డి కమిషన్ కి వ్యతిరేకంగా కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. ఎల్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలన్న కెసిఆర్ ప్రతిపాదనను తిరస్కరించింది. జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.

హైకోర్టులో సవాల్ చేసిన కేసీఆర్

విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడీషియల్‌ కమిషన్ ఏర్పాటు రద్దు కోరుతూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై గత శుక్రవారం వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్‌ చేసింది. గత బీఆర్‌ఎస్‌​ పాలనలో విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్‌ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు.

తీర్పు రిజర్వ్

ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్‌ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్‌ 30 వరకు కమిషన్‌ గడువు ముగుస్తున్నందున జూన్‌ 15న రావాలని కోరాం.’’ అన్నారు. వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్‌ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్‌ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్‌. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్‌ఎస్‌ కూడా సభలో పలు విషయాలపై కమిషన్‌ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు.ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వులో ఉంచింది. సోమవారం విచారణకు రావడంతో కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.