ఫేక్ మనుషులు..
ఫోర్జరీ డాక్యుమెంట్లు..!
– జూబ్లీహిల్స్‌లో భారీ భూ మాయ
– 6 ఎకరాల ల్యాండ్.. కబ్జాకు ప్లాన్
– దొంగ వారసులు, ఫేక్ డాక్యుమెంట్లతో స్కెచ్
– నిందితుల్లో సాహితీ లక్ష్మినారాయణ బంధువు
– గులాబీల పాలనలో గుర్తించలేని భూ స్కాములెన్నో?
– అగ్రిమెంట్లతో ఓనర్ షిప్ తీసుకున్న వారిపై ఐటీ గురి
– 600 కోట్ల ఆస్తిలో దొంగ పత్రాలతో 10 శాతమే డెవలప్మెంట్
– దొంగ వారసులను, కుట్రదారులను సీసీఎస్ గుర్తించిందా?
– అరెస్టులు చేయకుండా ఉండేందుకు ఏసీపీకి రూ.కోటి అందాయా?
– ఏడాదిన్నర అయినా చార్జీషీట్ ఎందుకు దాఖలు కాలేదు?
– ప్రైమ్ ఏరియాలో ఇంట్రెస్టింగ్ ఫోర్జరీ కబ్జా కహానీ
– ‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్ కథనం
గులాబీ.. బినామీ.. సునామీ పార్ట్- 5
దేవేందర్ రెడ్డి, చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: జూబ్లీహిల్స్.. నగరం నడిబొడ్డున అత్యంత కాస్ట్లీ ఏరియా. ప్రముఖ సంస్థలు, ప్రముఖుల ఇళ్లతో నిండిపోయి ఉంటుంది. అలాంటి ప్రైమ్ ఏరియాలో స్థలం అంటే మామూలు రేటు ఉండదు. గజం 3 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది. అందుకే, గులాబీ హయాంలో 6 ఎకరాల కబ్జాకు పక్కా స్కెచ్ గీశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 70లో సర్వే నెంబర్ 118( ఓల్డ్ 120/ఏ)లోని భూమికి అసలు ఓనర్ చింతపల్లి అచ్చయ్య. ఈయనకు 10.20 గుంటల భూమి ఉంది. డాక్యుమెంట్ నెంబర్ 1631/1966. నవాబ్ వద్ద నుంచి ఇది తీసుకున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. పొజిషన్‌లో కూడా ఉన్నాడు. ఇతని కుటుంబం హిల్ ఫోర్ట్‌లో నివాసం ఉండేది. బషీర్ బాగ్‌లో 2007 ఏప్రిల్ 11న అచ్చయ్య మరణించాడు. అయితే, యూఎల్సీ డిక్లరేషన్ కాకపోవడంతో సక్సెషన్ కాలేదు. కానీ, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి భూములనైనా ఇట్టే అప్పనంగా అప్పగించేసింది. ఈ భూమి వెనుక జరిగిన తతంగం, ఫేక్ డాక్యుమెంట్స్ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి.
కుటుంబ సభ్యుల మాదిరిగా కథ అంతా నడిపిన వైనం
అర్బన్ సీలింగ్ యాక్ట్ సీసీ నెంబర్ ఈ/2192/1998, జూన్ 19న యూఎల్సీ స్పెషల్ ఆఫీసర్ తప్పుడు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. వారసులు ఎవరు ఉన్నారో గుర్తించకుండానే డెత్ సర్టిఫికెట్స్ ఉన్నాయని తప్పుడు క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ అయింది. అచ్చయ్యకు ప్రేమ్ నారాయణ అనే కుమారుడు లేడు. కేవలం ముగ్గురు కుమారులు మాత్రమే. అప్పటికే పాపారావు, అంజనేయ వరప్రసాద్ అనే కుమారులు చనిపోయారు. వారి కొడళ్లుగా చెప్పుకుంటూ లీగల్ హెయిర్ సర్టిఫికెట్స్ తీసుకున్న లక్ష్మి దేవి, భారతీ దేవి, అన్నపూర్ణ దేవిలు అసలు కోడళ్లే కాదు. వీరంతా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకునే సమయానికి పెద్ద కుమారుడు చింతపల్లి శుభకర్ బతికే ఉన్నాడు. ఆయన భార్యగా జగిత్యాలకు చెందిన భారతీ అనే ఫేక్ పర్సన్‌ని సృష్టించారు. ఇక రెండో కుమారుడు పాపారావు, అతని భార్య పేరు నిర్మాలా కుమారి. కానీ, విజయవాడకు చెందిన లక్ష్మి దేవిగా చూపించారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలున్నారు. బోయపాటి మహిత, కొండపనేని హరిత. ఈయన 25-09-1986లో చనిపోతే, 26-08-1982లో చనిపోయినట్లు దొంగ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈయన భార్య నిర్మలా ఇంకా బతికే ఉంది. మూడో కుమారుడు అంజనేయ వరప్రసాద్. ఇతని భార్య అన్నపూర్ణ దేవిగా, ఊరు బెంగుళూరుగా చిత్రీకరించారు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. నిజానికి ఈయన భార్య పేరు నాగ కష్ణ మహేశ్వరి. ఈమె 23-11-1991లోనే చనిపోయారు. కానీ దొంగ పేరుతో బతికించారు. వీరికి ధీరజ్, స్మిత అనే ఇధ్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా విజయవాడలో సెటిలయ్యారు. వర ప్రసాద్ 03-10-1995లో మరణిస్తే, 02-08-2000 సంత్సరంలో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేశారు.
డాక్యుమెంట్స్ దందాలు.. కోర్టుకు తప్పుడు పత్రాలు
బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నెంబర్ 4127/2022, 4128/2022, 4129/2022 అనే మూడు డ్యాకుమెంట్లకు గాను 48,980 గజాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇర్రెవొకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించి ఇచ్చారు. ఇదే పది మంది దొంగ వారసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నెంబర్ 10768 ఆఫ్ 2022. డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సిందిగా కోరారు. రెగ్యులరైజేషన్ కాలేకపోవడంతో గతంలో నిజాంపేట్ కోర్టు తీర్పులు వర్తించవని తెలివిగా కోర్టును తప్పుదారి పట్టించి ఉత్తర్వులు తీసుకున్నారు. అయితే, ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫేక్, ఫోర్జరీగా పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. కానీ, ఆ తర్వాత ఓ ఏసీపీతో రాయబారం నడిపించి కోటి రూపాయలు లంచం అప్పగించి కేసును కనిపించకుండా చేశారు.
అంతా ఆ మధుసూదన్ రెడ్డి కనుసన్నల్లోనే!
అచ్చయ్య కుటుంబం వద్ద కావలి రాములు అనే వ్యక్తి పని మనిషిగా ఉండేవాడు. అచ్చయ్య చనిపోయిన తర్వాత ఆయన వద్ద ఉండే కీలక డాక్యుమెంట్లు దొంగలించాడని సమాచారం. దీంతో ఆ భూముల్లో గుడిసెలు వేయించి అంతా తమదే అంటూ బిల్డర్స్ వద్దకు తిరిగినట్లు తెలుస్తోంది. అప్పటికే సాహితీ లక్ష్మి నారాయణకు అత్యంత సన్నిహితుడి కూతురు కుటుంబానికి బంధువు అయిన కే మధుసూదన్ రెడ్డి చక్రం తిప్పాడు. సాహితీలో ఎలాగైతే ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి భూములను కొనుగోలు చేసి, అమ్మినట్టు చూపించారో, ఇక్కడ కూడా అన్నీ ఫేక్ మనుషులు, ఫేక్ సర్టిఫికెట్స్‌తో దందా నడిపించాడు. అందుకు కావాలి రాములు, వెంకట రాములు, మాసుల విజయలక్ష్మి, మసుల సుభాష్, మహేష్‌లను వాడుకున్నాడు. కుటుంబ సభ్యులుగా ఫేక్ గాళ్లను తయారు చేయడానికి ప్రత్యేకంగా నకిలీ ఐడీ కార్డులను సృష్టించినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో కీలకంగా సీసీఎస్ లింక్స్.. నెక్స్ట్ కథనం
ఈ భూముల్లో డెవలప్మెంట్ చేసుకున్న కంపెనీలు ఎంటి? ఎంత సొమ్ము ఇచ్చారు. రిజిస్ట్రేషన్ విలువ ఎంత? వారి సంపదపై ఐటీ అధికారులు ఏమంటున్నారు? సీసీఎస్ పోలీసుల దాగుడు మూతలు ఏంటి? అంతిమ లబ్దిదారులు ఎవరో మరో ఇన్వెస్టిగేషన్ కథనంలో చూద్దాం.