Mulugu name change
Politics, Top Stories

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

  • ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు
  • ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన
  • మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల
  • సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీస్ జారీ
  • లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు మూడు భాషల్లో తెలియజేయవచ్చని ఆదేశాలు
  • 3 జులైన పూర్తయిన అభ్యంతరాల పరిశీలన
  • పేరు మార్పునకు రంగం సిద్ధం

T.government change the name of Mulugu into Sammakka Saralamma Mulugu

ములుగు జిల్లా పేరు మార్పు దిశగా టీ సర్కార్ అడుగులు వేస్తోంది. ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క-సారలమ్మ ములుగు’ జిల్లాగా మార్చేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జూన్ 29న ములుగు జిల్లా పంచాయతీ అధికారి సర్క్యులర్ జారీ చేశారు. ములుగు జిల్లా పరిధిలో మొత్తం 9 మండలాలు, 174 గ్రామ పంచాయతీలు ున్నాయి. చాలా కాలంగా ములుగు జిల్లాకు పేరు మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ప్రజా విజ్ణప్తులపై సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సమ్మక్క-సారలమ్మ ములుగు గా జిల్లా పేరు పెట్టాలని చేసిన మంత్రి సీతక్క విజ్ణప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసింది.కాగా పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాసూచనల స్వీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు అధికారులు. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక అభ్యంతరాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దరఖాస్తులను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఏదైనా సరే స్వీకరించి అభ్యంతరాలపై రాష్ట్ర సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

జులై మూడు లోగా అభ్యంతరాలు

‘‘ములుగు జిల్లా పేరును సమ్మక్క- సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు ప్రతిపాదించడం జరిగిందని.. ఈ విషయంపై జిల్లాల్లోని సమస్త గ్రామ పంచాయితీలలో బుధవారం (జూలై 3) రోజున ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి చర్చించి.. అందుకు సంబంధించి మినిట్స్ కాపీని జిల్లా పంచాయితీ కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా పేరును సమ్మక్క- సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు విడుదల చేయబడిన ములుగు జిల్లా రాజపత్రం అధికారిక ప్రచరుణ ఫారం నెంబర్ 1ను సమస్త గ్రామ పంచాయితీలలో నోటీసు బోర్డుపై అతికించి ఏమైన అభ్యంతరములు ఉన్నచో లిఖితపూర్వకంగా ములుగు జిల్లా కలెక్టర్‌కు సమర్పించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మండల పంచాయితీ అధికారులు ప్రత్యేక గ్రామసభల నిర్వహణ పర్యవేక్షించి పూర్తి సమాచారమును ఈ కార్యాలయమునకు పంపుటకు కోరడం జరిగింది’’ అని జిల్లా పంచాయితీ అధికారి సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.

జిల్లాగా మారిందే తప్ప పేరు మారలేదు

ఇక, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా పాత పది జిల్లాల స్థానంలో 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత కూడా మరికొన్ని జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ రావడంతో.. మరో రెండు జిల్లాలు నారాయణపేట, ములుగును 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. కొత్త జిల్లా ఏర్పాటుకు ముందు.. ములుగు అంతకుముందు వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండేంది. ప్రస్తుతం ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలు, 174 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. అయితే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలనే డిమాండ్ బీఆర్ఎస్ హయాం నుంచే వినిపిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు పేర్లు ఆయా జిల్లాల పరిధిలో కేంద్రీకృతమైన దేవుళ్ల పేరుతో కలిపి పెట్టారని.. అలాగే ములుగు జిల్లాకు కూడా సమ్మక్క సారక్క పేరు పెట్టారని పలువురు కోరుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.