Borugadda Anil: వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బోరుగడ్డ అనిల్ కు బిగ్ షాక్ తగిలింది. తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. అతడు వైసీపీ పేరు చెప్పుకొని తిరుగుతున్నప్పటికీ అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
వైసీపీ ఏం చెప్పిందంటే?
ఇటీవల కాలంలో బోరుగడ్డ అనిల్ పలు మీడియా ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా వేదికలలో తనను తాను వైసీపీకి చెందిన నేతగా అభివర్ణించుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ స్పందిస్తూ ‘బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది.
వైసీపీ తరపున మాటల దాడి
గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh)పై విరుచుకుపడ్డారు. తనను తాను వైసీపీ నేతగా అభివర్ణించుకుంటూ పలుషమైన పదజాలాలతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేసినప్పటికీ అతడిపై చర్యలు తీసుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బోరుగడ్డ అనిల్ పై నమోదైన కేసులపై విచారణ జరిపింది. ఈ క్రమంలో పోలీసులు అతడ్ని అరెస్టు కూడా చేశారు.
Also Read: Road Accident: పొగ మంచు ఎఫెక్ట్.. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే..!
వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే!
అయితే పోలీసుల దర్యాప్తు సందర్భంగా బోరుగడ్డ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనచేత వైసీపీ నేతలే ఆ విధంగా మాట్లాడించారని పేర్కొన్నారు. ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను తిట్టానని అంగీకరించాడు. అయితే అతడు ఇచ్చిన స్టేట్ మెంట్ ను వైసీపీ అధికార ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వైసీపీ తరపున అతడు ఎలాంటి పదవిలో లేరని తేల్చిచెప్పారు. కనీసం పార్టీ మెంబర్ షిప్ కూడా అతడికి లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తాను వైసీపీ కాదని చెప్పిన ఓ అధికార ప్రతినిధిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో బోరుగడ్డ అనిల్ కు తమ పార్టీతో సంబంధం లేదని వైసీపీ మరోమారు అధికారికంగా ప్రకటించింది.

