Road Accident: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా (Alluri district)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగ మంచు కారణంగా ఓ టూరిస్ట్ కారు (Tourist Car) వంతెనను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు స్పాట్ లోనే మరణించగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం (Hukumpeta) పరిధిలోని రాళ్లగడ్డ వంతెన వద్ద తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మేఘాలకొండ నుంచి అరకు వెళ్తున్న ఓ కారు రాళ్లగడ్డ వంతెన వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పింది. బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక హుకుంపేట ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా రహదారి కనిపించక డ్రైవర్ వంతెనను ఢీకొట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే స్పాట్ లోనే చనిపోయిన వ్యక్తిని రుద్రగా పోలీసులు గుర్తించారు. అతడు గీతం కాలేజీలో చదువుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు అల్లూరి జిల్లాలో రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఉదయం 9-10 గంటల వరకూ మంచు ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 4 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్పల్ప ఉష్ణోగ్రతలు.. అల్లూరి జిల్లాలోని మినములూరులోనే రికార్డు కావడం గమనార్హం. ఏపీలోని అరకు, పాడేరులో వరుసగా 4.6, 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: IND vs SA 2nd T20I: నేడే సౌతాఫ్రికాతో రెండో టీ-20.. ఫుల్ జోష్‌లో భారత్.. మ్యాచ్‌కు వర్షం ముప్పు!
భారీగా ఉష్ణోగ్రతలు పతనమవుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రాత్రి లేదా తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దని హితవు పలుకుతున్నారు. పొగ మంచు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొద్దిసేపు వాహనాలను పక్కన నిలిపి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా జరగబోయే ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. చలికాలం నేపథ్యంలో పొగ మంచును అధిగమించే హెడ్ లైట్ ను వినియోగించాలని వాహనదారులకు నిపుణులు సూచిస్తున్నారు.

