Cricket Betting: వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో నాని ప్రధాన అనుచరుడ్ని గుడివాడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో కూనసాని వినోద్ (Kunasani Vinod)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలో గత కొంతకాలంగా అతడు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు అనంతరం అతడి నుంచి రూ.50 వేల నగదు, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాట శిబిరాలను సైతం..!
కొడాలి నాని ప్రధాన అనుచరుడిగా గుడివాడలో కూనసాని వినోద్ కు పేరుంది. గత వైసీపీ హయాంలో అతడు పేకాట శిబిరాలను సైతం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా వినోద్.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో నాని అనుచరుడిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆన్ లైన్ బెట్టింగ్ లో నిమగ్నమై ఉన్న క్రమంలో ఒక్కసారిగా అతడ్ని పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు.
నానికి పెద్ద ఎదురు దెబ్బ!
రైట్ హ్యాండ్ గా ఉన్న వినోద్ అరెస్టు.. కొడాలి నానికి పెద్ద ఎదురు దెబ్బేనని గుడివాడలో చర్చ జరుగుతోంది. నానికి కుడి భుజంగా ఉంటూ అన్ని పనులు చక్కబెట్టే వినోద్ కటకటాల్లోకి వెళ్లడం నానిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూనసాని వినోద్ ను అదుపులోకి తీసుకున్న గుడివాడ పోలీసులు.. తమదైన శైలిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి సంచలన విషయాలు వెలుగు చూస్తాయోనన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడింది.
Also Read: IND vs SA 5th T20I: కొద్ది గంటల్లో ఐదో టీ20.. టీమిండియాలో భారీ మార్పులు.. ఈ ఇద్దరు స్టార్లు ఔట్!
రాజకీయాలకు నాని బ్రేక్స్!
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కొడాలి నాని.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కేసులు, అనారోగ్యం, గుండె ఆపరేషన్ కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారని గుడివాడలో అందరూ చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 18 నెలలుగా నియోజకవర్గంలో, రాష్ట్ర రాజకీయాల్లో నాని చురుగ్గా వ్యహరించడం లేదన్న ప్రచారముంది. ఆరోగ్య కారణాల రిత్యా మరో 6 నెలలు కూడా నాని చురుగ్గా ఉండే అవకాశం లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కుడి భుజంగా ఉన్న కూనసాని వినోద్ అరెస్టు కావడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

