YS sharmila: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)పై.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు వైఎస్. షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రప్పా రప్పా నరుకుతాం వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి ఈ తరహా వ్యాఖ్యలను ప్రోత్సహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అవి రెచ్చగొట్టే, హింసాకత్మక వ్యాఖ్యలను షర్మిల అన్నారు. నరుకుతాం, సంపుతాం, బట్టలు ఊడదీస్తాం అంటూ జగన్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డారు.
జగన్‌కు మోదీ సపోర్ట్
వైఎస్ జగన్ కు ప్రధాని మోడీ సపోర్ట్ ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అందుకే జగన్ ఏది చేసినా చెల్లుబాటు అవుతోందని అన్నారు. ప్రధాని మద్దతు చూసుకొని బహిరంగంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రప్పా రప్పా నరుకుతాం వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా.. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. జగన్ మోదీకి ముమ్మాటికి దత్తపుత్రుడేనని అన్నారు.
ప్రధానికి సూటి ప్రశ్నలు
మరోవైపు యోగాంధ్ర కోసం విశాఖ రాబోతున్న ప్రధాని మోదీ (Prime Minister Modi)కి షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. ఈ సారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా? లేదా? అని నిలదీశారు. స్పష్టమైన హామీలు ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న అన్యాయంతో రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయని షర్మిల అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. విభజన హామీలు, తిరుపతి వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమయ్యాయో ప్రధాని చెప్పాలని పట్టుబట్టారు.
Also Read: Polavaram Project: పోలవరంతో తెలంగాణకు ముప్పు.. న్యాయ పోరాటానికి రెడీ.. కవిత వార్నింగ్!
పోలవరంపైనా మోసం!
పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ ప్రధాని మోదీ.. ఆంధ్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎత్తు తగ్గించి ప్రాజెక్ట్ ప్రాణం తీశారని మండిపడ్డారు. 45 మీటర్ల నుంచి 41కి తగ్గించి మోసం చేశారని దుయ్యబట్టారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే అది ప్రాజెక్ట్ కాదని.. బ్యారేజ్ అవుతుందని షర్మిల పేర్కొన్నారు. విశాఖ స్టీల్ విషయంలోనూ ప్రధాని మోసం చేశారని.. ప్రైవేటీకరణ లేదని చెబుతూనే ఫ్లాంట్ ను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్లాంట్ లో 4 వేల కార్మికులను తొలగించారని అన్నారు. ప్రధాని మోసం చేస్తున్నా.. వెన్నుపోటు పొడుస్తున్నా చంద్రబాబు, పవన్ మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.