Yogandhra 2025: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025.. వైభవంగా జరిగింది. విశాఖ కేంద్రంగా జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day)కు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Syed Abdul Nazeer), ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పలువురు కేంద్రమంత్రులు ఈ వేడుకల్లో పాల్గొని యోగసనాలు వేశారు. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే?
యోగాంధ్ర-2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీకి తొలుత సీఎం చంద్రబాబు.. ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ.. దేశప్రజలతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ యోగా డే (Yoga Day) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాలను యోగా ఏకం చేసిందన్న ప్రధాని.. యోగ దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని.. గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందని అన్నారు. యోగాకు హద్దులు లేవని.. వయసుతో పనిలేదని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.
యోగాతో క్రమశిక్షణ: చంద్రబాబు
యోగాంధ్ర-2025 కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం మాట్లాడారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. రోజు గంట సేపు యోగా చేయగలిగితే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. యోగా అంటే కేవలం వ్యాయమమే కాదన్న చంద్రబాబు.. ఇది చేయడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. యోగాను అన్ని క్రీడాల్లో భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు స్వర్ణాంధ్ర 2047 విజన్ లో యోగాకు తగిన ప్రాధాన్యం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం స్పీచ్
విశాఖలో జరిగిన యోగాంధ్ర-2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ప్రపంచ యోగాదినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని పవన్ అన్నారు. భారత సనాతన ధర్మం (Sanatana Dharma) విశిష్టతను ప్రధాని మోదీ.. యోగ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారని పవన్ ప్రశించారు. యోగా చేసేవారు మానసికంగా ఎంత దృఢంగా ఉంటారనే దానికి ప్రధాని మోదీ ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘వన్ ఎర్త్.. వన్ హెల్త్’ (One Earth.. One Health) థీమ్‌ను విశాఖ వేదిక నుంచి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరముందని పవన్ నొక్కి చెప్పారు.
Also Read: BRS on Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం.. ప్రశ్నించే గొంతును అణిచివేస్తారా.. బీఆర్ఎస్ ఫైర్
యోగాతో ప్రపంచ రికార్డ్
విశాఖ కేంద్రంగా జరిగిన యోగాంధ్ర-2025 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా గిన్నిస్ (Guinness World Records 2025)లో పేరు సంపాదించింది. గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా డేలో 1.47 లక్షల మంది పాల్గొన్నారు. ఇదే ఇప్పటివరకూ గిన్నిస్ రికార్డ్ గా కొనసాగుతూ వచ్చింది. అంతకుముందు తన ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నట్లు ప్రకటించారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారని అన్నారు. కాగా శుక్రవారం 22 వేల మంది గిరిజిన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.