BRS on Kaushik Reddy Arrest: క్వారీ ఓనర్ను బెదిరించిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ కి తరలించారు. అయితే ఈ అరెస్ట్ ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రేవంత్ సర్కార్ కుట్ర పూరిత రాజకీయాలకు తెగబడుతోందంటూ మండిపడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
అన్యాయాలపై ప్రశ్నిస్తున్నందుకే!
సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీని తలపించే పాలన
ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేసి ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలనపై, బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?
హరీశ్ రావు రియాక్షన్!
బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు సైతం కౌశిక్ రెడ్డి అరెస్టును ఎక్స్ వేదికగా ఖండించారు. ‘పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ హరీశ్ రావు రాసుకొచ్చారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.
రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.
ఇందిరమ్మ…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 21, 2025
కౌశిక్ రెడ్డిపై కేసు ఎందుకంటే?
హనుమకొండ జిల్లా కమలాపురం మండల పరిధిలోని వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించారు. దీనికి సంబంధించి బాధిత వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కాదని వ్యాపారం చేసుకోలేరని డబ్బులు ఇవ్వాల్సిందేనని లేదంటే చంపేస్తానని భయపెట్టారని ఆమె పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.