Nara Lokesh Red Book: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందంటూ విపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించినవారికి మాత్రమే రెడ్ బుక్ వర్తిస్తుందని అన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి రెడ్‌బుక్‌లోఉన్నవారిని వదిలిపెట్టబోమని ఆయన మంత్రి హెచ్చరించారు. రెడ్ బుక్ దెబ్బకు ఒకరికి గుండె పోటు వచ్చిందని, మరొకరు చెయ్యి విరగ్గొట్టుకున్నారని నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
యువగళం కార్యక్రమాన్ని యాంకరింగ్ చేసినందుకు ఉదయభానుని కూడా ట్రోల్ చేశారని లోకేష్ ప్రస్తావించారు. ఆమెపైనే కాదు.. ఆ వేదికపై ఉన్న వాళ్లపై కూడా కేసులు పెట్టారని, తనపై 23 దొంగ కేసులు పెట్టారని ఆయన చెప్పారు. ‘‘ ఆ రోజే నేను చెప్పా, ఆ సైకో చేష్టలకు తగ్గేదేలే అని. వైసీపీ వాళ్లు పనిచేయరు’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత ఇంటివద్ద గేట్లు వేసి అడ్డుకోవడం లేదని, తప్పుడు కేసులు పెట్టడం లేదని లోకేష్ ప్రస్తావించారు. జగన్‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా ‘జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నామని గుర్తుచేశారు. జగన్ స్వేచ్ఛగా జనాల్లోకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
Also read: Collector Muzammil Khan: రైతన్నను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. అసలు స్టోరీ ఇదే!
వైసీపీ నాయకులు, నేతలు దుష్ప్రచారం చేస్తే ఏవిధంగా తిప్పికొట్టాలో తమకు తెలుసనని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ఆలోచనలు మొత్తం జైలు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయని, అందుకే ఆయన ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ ఆయన ఎవరినీ కలవలేదు, ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలతో మమేకం కావడంలేదని ఎద్దేవా చేశారు. కనీసం సొంత తల్లి, చెల్లిని పట్టించుకోని వైఎస్ జగన్, ఇతరులను విమర్శించడం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు.
మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గురువారం ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు ఆయన శాశ్వత ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైసీపీ మత రాజకీయం
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ఉద్దేశపూర్వకంగానే కులాలు, మతాల మధ్య వైసీపీ గొడవలు పెడుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఇంకా చేస్తూనే ఉంటారని అన్నారు. ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడవడంలేదని వార్నింగ్ ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో వరుసబెట్టి వందలాది సీసీకెమెరాల ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి సరిపోయిందని, లేదంటే ఇది హత్యేనని జనాలపై రుద్దేసేవారేగా అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కేసుకు సంబంధించి కుట్రపూరితంగా వైసీపీ వర్గాలు చేసిన ప్రచారమని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని, ఈ వ్యవహారం ఇప్పటితో అయిపోలేదని, రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు ఇంకా చేస్తానే ఉంటారని లోకేష్ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది వైసీపీ లక్ష్యమని ధ్వజమెత్తారు.
యువగళం హామీని నెరవేర్చా
విపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఈ ప్లాంట్‌ని ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చానని, దుష్ప్రచారం చేస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తోడ్పాటుతో రైతులు 50 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచారని, రిలయన్స్‌కు సంబంధించిన 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.
Also read: Sharmila On Avinash Reddy: నెక్స్ట్ టార్గెట్ సునీతేనా? షర్మిల సంచలన కామెంట్స్
నియోజకవర్గంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తుంటే ఏదో జరిగిపోతున్నట్టు అపోహ కల్పిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ తయారు చేసే ప్లాంట్లపై సైతం అపోహలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘ దుష్ప్రచారం చేసేవారికి ఒకటే చెబుతున్నారు. రండి, వచ్చి ప్లాంట్ చూడండి, వెళ్లి మీ నాయకుడిగా చెప్పండి. అంతేగానీ, ప్లాంట్‌కి అడ్డుపడితే రెడ్‌బుక్‌లోకి మీ పేరు ఎక్కుతుందని వైసీపీవారిని హెచ్చరిస్తున్నా. దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడిగా ఈ మాట చెబుతున్నాను’’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని, కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.