Sharmila On Avinash Reddy: వైఎస్ వివేకానంద (YS Vivekananda) దారుణ హత్య.. ఏపీలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఇప్పటికీ ఈ కేసు తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన తండ్రి చావుకు న్యాయం చేయాలంటూ కూతురు సునీత గత కొన్నేళ్ల నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తన తండ్రి మరణానికి కారణమంటూ ఆమె పదే పదే చెబుతూ వస్తున్నారు. మాజీ సీఎం జగన్ (Jagan Mohan Reddy)పైనా ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు.
సునీతకు ప్రాణహాని
వైఎస్ వివేకా హత్య (YS Viveka) కేసుపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ఇటీవల ఓ విచారణ అధికారిని సైతం బెదిరించారన్న ఆమె.. అధికారిపై ఒత్తిడి తెచ్చి రిపోర్టు ఇప్పించుకున్నారని చెప్పారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారన్న ఆమె.. వివేక కుమార్తె సునీత ప్రాణాలకు సైతం ముప్పు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ఆమెను ఏమైనా చేస్తారనే భయం తనకు ఉందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
‘బెయిల్ రద్దు కావట్లేదు’
ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు కాబట్టే స్వేచ్ఛగా సాక్షాలను తారు మారు చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. అందుకే సునీతకు న్యాయం జరగడం లేదని అభిప్రాయపడ్డారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయడం లేదని అన్నారు. వివేకాను ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇప్పించారని.. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డేనని షర్మిల అన్నారు.
Also Read: Chikoti Praveen: దోషాన్ని తొలగిస్తే మీరే సీఎం.. చికోటి ప్రవీణ్ కు బంపర్ ఆఫర్.. ఆ తర్వాత?
వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై..
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపైనా షర్మిల తాజాగా మాట్లాడారు. ఈ సవరణల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ మళ్లీ ఖూనీ చేసిందన్నారు. దీనిని ముస్లిం కమ్యూనిటీ, దేశ ఐక్యత, రాజ్యాంగంపై దాడిగా ఆమె అభివర్ణించారు. ఈ చట్ట సవరణలతో ముస్లింలకు తీరని అన్యాయం కేంద్రం చేసిందన్నారు. వక్ఫ్ ఆస్తులను కాజేసే కుట్ర బీజేపీ చేస్తున్నట్లు ఆరోపించారు. మతం, కులం పేరు చెప్పి బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్దిపొందాలను కమలం పార్టీ చూస్తున్నట్లు ఆరోపించారు. బీజేపీతో కూటమిలో ఉన్న చంద్రబాబు.. ముస్లింలకు ఏం చెప్పి ముఖం చూపిస్తారని నిలదీశారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం దీనిపై స్పందించాలని అన్నారు.