Thalliki Vandanam Scheme: ఏపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్కీమ్ పై వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
75 శాతం హాజరు తప్పనిసరి
తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఆ సాయం పొందడానికి కీలక నిబంధనను ప్రభుత్వం జత చేయబోతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తించేలా కూటమి సర్కార్ (AP Govt) మార్గ దర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా హాజరు శాతం లేనిపక్షంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) నిధులు జమ కావని అంటున్నారు. అదే జరిగితే 75 శాతం కంటే తక్కువ హాజరు శాతం కలిగిన పిల్లల తల్లులు.. పథకానికి దూరం కానున్నారు.
విడతల వారీగా..
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇటీవల శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. మత్య్సకార భరోసా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తల్లికి వందనం పథకంపై మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే సీఎం ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. నగదును ఒకేసారి ఖాతాల్లో జమ చేయాలా? లేదా వాయిదాల పద్దతిలో చెల్లించాలా? అన్న దానిపై అధికారులతో చర్చిస్తున్నట్లు సీఎం అన్నారు. ఇన్ స్టాల్ మెంట్స్ అంటే తొలుత రూ.7,500 ఖాతాల్లో జమ చేసి కొంతకాలం తర్వాత మరో రూ.7,500 డిపాజిట్ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
Also Read: Yadagiri Gutta Hundi income: యాదాద్రిలో హుండీ లెక్కింపు.. భారీగా కానుకలు.. ఎంతంటే?
నిధులు రెడీ..
ఇదిలా ఉంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ బడ్జెట్ లోనే కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ. 9407 కోట్లను కేటాయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో పథకానికి 69.16 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు కాకుంటే ఆ సంఖ్య మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే 75% హాజరు కాకుండా.. 40% ఉత్తీర్ణత పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
