TDP Mahanadu 2025: తెలుగు దేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమం కడప వేదికగా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటే సాగే ఈ కార్యక్రమంలో తొలి రోజున సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేవుని గడప అయిన కడపలో తొలిసారి మహానాడు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈసారి మహానాడు కార్యక్రమం చరిత్ర సృష్టించబోతున్నట్లు చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల గెలిచామని ఈసారి మరింత కష్టపడి పదికి పది సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
టీడీపీ పని అయిపోయిందన్నారు!
గత వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులు ఎన్నో కష్టాలు అనుభవించారని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) అన్నారు. ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని చెప్పారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారని గుర్తుచేశారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయిందని చంద్రబాబు అన్నారు. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొందని అన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైన ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదని.. టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని అన్నారు.
వైసీపీ అవినీతిపై రాజీలేని పోరాటం
రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిపించి వైసీపీని ప్రజలు తరిమేశారని అన్నారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి ఒక్కో మెట్టు పేరుస్తున్నామని చెప్పారు. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని.. రాష్ట్రాభివృద్ధిపై ప్రజల్లో ఆశలు చిగురించాయని అన్నారు.
Also Read: Covid-19 cases India: కరోనా కలవరం.. రికార్డ్ స్థాయి కేసులు.. మూడేళ్ల తర్వాత ఫస్ట్ టైమ్!
ఆ రోజు నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం
మహానాడు వేదికపై రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు.. వాట్సప్ గవర్నెన్స్ గురించి చంద్రబాబు మాట్లాడారు. అదోక గేమ్ ఛేంజర్ గా మారిపోయిందని కొనియాడారు. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ చేపడతామని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి 3 విడతల్లో రూ.20వేలు అందిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని.. డిజిటల్ కరెన్సీ వచ్చాక వాటి అవసరం లేకుండా పోయిందని సీఎం అన్నారు. పెద్ద నోట్ల రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం అభిప్రాయపడ్డారు.