Siddharth Kaushal: ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా 20 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ రాజీనామా చేసేశారు. తాను స్వచ్ఛందంగానే ఐపీఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, తాను పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ‘ ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నాపైన ఎటువంటి ఒత్తిడి లేదు. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నా రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవు. స్వతంత్రంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను. దీర్ఘకాలిక ఆలోచన, జీవన లక్ష్యాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎస్ సేవలో పని చేయడం అత్యంత గౌరవప్రదమైన అనుభవం. ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పుడూ నా ఇంటిలాగే, సొంత రాష్ట్రంగా భావించాను. రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు, సహచరులకు, ప్రజలకు.. నాకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి పౌరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇకపై జీవితాన్ని కొత్త లక్ష్యాలతో, సమాజానికి మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాను’ అని కౌశల్ లేఖలో వెల్లడించారు.
Read Also- BJP: తెలంగాణ బీజేపీలో చంద్రబాబు చక్రం తిప్పారా..?
ఎందుకీ ప్రచారం..?
వాస్తవానికి రెండు మూడ్రోజులుగా సిద్ధార్థ్ కౌశల్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున చిత్రవిచిత్రాలుగా ప్రచారం జరుగుతున్నది. ఎవరికి తోచినట్లుగా వాళ్లు ట్విట్టర్‌లో రాస్తుండటం, కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏది నిజమో..? ఏది అబద్ధమో..? తెలియని పరిస్థితి. ఇక వైసీపీ కార్యకర్తలు, అనుబంధ మీడియా, సోషల్ మీడియా అయితే.. కూటమి ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో కౌశల్ వీఆర్ఎస్‌కు అప్లై చేసుకున్నారని ప్రచారం చేస్తున్న పరిస్థితి. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సిద్ధార్థ్.. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్) గా పనిచేస్తున్నారు. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. 20 ఏళ్లు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడం లేనిపోని అనుమానాలకు తావిస్తున్నది. ఆయన ఏ జిల్లాకు వెళ్లినా విధుల పట్ల చాలా కఠినంగా, నిజాయితీగా ఉండే యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. అయితే నెల రోజులుగా ఆయన విధులకు హాజరుకావట్లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఐపీఎస్‌ను వదిలి.. ప్రైవేట్‌కు!
రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఐపీఎస్ (IPS) అధికారులను హింసిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరందుకున్నది. ఈ టార్చర్ భరించలేకనే తన పదవికి సిద్ధార్థ్ గుడ్ బై చెప్పినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ బుక్ పాలనకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలి అవుతున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల కెరియర్ ఉన్న కౌశల్ రిజైన్ చేసి.. భవిష్యత్తులో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నట్లు కౌశల్ పేర్కొన్నారు. కొన్ని నివేదికల ప్రకారం, ఆయన ప్రైవేట్ రంగంలోకి, ముఖ్యంగా ఢిల్లీలో ఓ కార్పొరేట్ పాత్రను చేపట్టాలని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. సిద్ధార్థ్ 2000 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. వాస్తవానికి సిద్ధార్థ్‌కు ఈ జాబ్ అనేది జీవిత లక్ష్యమని.. ఇందుకోసం ఎంతో కష్టపడి ఉంటారని.. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? వ్యవస్థను చంపేస్తున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదని, అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరికి డీజీ స్థాయి అధికారులు పీఎస్ఆర్ ఆంజినేయులు, పీవీ సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐటీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసిందనే ఆరోపణలూ రాష్ట్ర ప్రభుత్వంపైన ఉన్నాయి. ఈ రాజీనామా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి, పోస్టింగ్‌ల ఆలస్యం, తరచుగా బదిలీలు లేదా సస్పెన్షన్‌లు వంటి అంశాలపై చర్చకు దారితీసింది.
Read Also- Vallabhaneni Vamsi: ఎట్టకేలకు వల్లభనేని వంశీ విడుదల.. ఇక రాజకీయ సన్యాసమేనా?