Rayalaseema: రాయలసీమ జిల్లాల్లో కరువు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి పట్టణం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలలో కరువును శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కలిసికట్టుగా కూర్చుని ఆలోచన చేయాలని, అలాగే కేంద్రంతో కూడా కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలన్నారు. అధికారులు ఆయా జిల్లాల యంత్రాంగంతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఈజిఎస్, వాటర్ షెడ్, తదితర వాటి కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని, ఇతర శాఖలకు సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది అధికారులకు క్షుణ్ణంగా తెలుసని, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా అధిగమించవచ్చు అనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో కరువుకు శాశ్వత పరిష్కారం ఏ విధంగా తీసుకురావచ్చు అనేదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, రేపు, భవిష్యత్తులో ఏం చేయాలి, వచ్చే పదేళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ విషయం అధికారులు అంతా కలిసికట్టుగా కూర్చుని తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఏమైనా ఆలోచనలు ఉంటే తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ తయారుచేసి కరువు నివారణకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని, కేంద్రం కూడా ఇందుకు సహకారం అందిస్తుందన్నారు.
Read Also- Telangana: ఇండియా మ్యాప్‌లో తెలంగాణను మరిచారా.. అక్కర్లేదా?
రైతన్నలే బలం..
రైతులే దేశానికి బలమని.. మహిళలు పేదరికం నుంచి తలెత్తి నిలవాలని శివరాజ్ అన్నారు. గురువారం పుట్టపర్తి మండలం, పెడబల్లి గ్రామ పొలాల్లో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులే దేశానికి బలం అని నలుమూలలకూ ఆహారం అందించే బంధంలాంటి రైతు సమాజం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధిలో రైతుల పాత్ర అత్యంత కీలకమని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ చేతన్ సూచించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇది దేశానికి ఆదర్శంగా మారుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి, తక్కువ భూమిలోనూ అధిక లాభాన్ని సాధించవచ్చని, దీనివల్ల చిన్న రైతులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ‘ సోదరీమణులు ఇప్పుడు స్వయం సమర్థులవుతున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా, గౌరవంగా జీవించేందుకు ముందడుగు వేస్తున్నారు. పేదరికం నుంచి బయటపడుతూ, సమాజంలో తలెత్తి నిలవాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు. ఇది ఎంతో అభినందనీయం. నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన లాడ్లీ బహనా యోజనను గుర్తు చేస్తున్నాను. మహిళల సాధికారతకు నేను ప్రాధాన్యం ఇస్తాను. రైతుల సేవ చేయడం అంటే నాకు భగవంతుని సేవ లాంటిది’ అని చౌహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జేసి అభిషేక్ కుమార్, భారత ప్రభుత్వ రైతుల సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ పేర్ని దేవి, రాష్ట్ర సెర్ప్ సీఈ కరుణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అగ్రికల్చర్ ,మార్కెటింగ్ , సహకార సంస్థ చైర్మన్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడి నర్సయ్య, రైతులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Also- Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరిన కీలక నేత బహిష్కరణ