Pawan Kalyan: తన అనుమతి తీసుకోకుండా, వాణిజ్య ప్రయోజనాల కోసం తన ఫొటోలు, పేరు, వాయిస్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి నిరోధించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) ఊరట దక్కింది. అనుమతి తీసుకోకుండా పవన్ ఫోటోలు, వీడియోలు, గొంతును ఉపయోగించిన సోషల్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ-కామర్స్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ లింకులు తొలగించండి
పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా, ఆయన ప్రైవసీకి సంబంధించి ఉపయోగించిన ఫొటోలు, వీడియోలు, వాయిస్‌తో కూడిన లింకులను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఇటీవలే ఢిల్లీ హైకోర్టును పవన్ ఆశ్రయించారు. వ్యక్తిగత హక్కుల రక్షణతో పాటు, తన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం వాదనలు ఆలపించింది. పవన్ కళ్యాణ్ తరపున సాయి దీపక్ అనే లాయర్ వాదనలు వినిపించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, దీనిని పరిగణనలోకి తీసుకొచ్చి ఆయన వ్యక్తిత్వ హక్కులను కాపాలని కోరారు. అనుమతి లేకుండానే పవన్ పేరు, ఫోటోలు, వాయిస్‌ను వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం, పవన్‌ను అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
Read Also- Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!
ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు ఎందుకు?
తాజాగా పవన్ కళ్యాణ్, గతంలో జూనియర్ ఎన్టీఆర్, అంతకుముందు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోలు సైతం తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి సానుకూలా తీర్పు పొందారు. మరి వీళ్లంతా ఉండేది ఢిల్లీలో కాకపోయినా అక్కడే ఎందుకు పిటిషన్లు వేస్తున్నారు?. తెలుగు హీరోలు తెలంగాణ, లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పిటిషన్ వేయవచ్చు కదా? అనే సందేహాలు కలగడం సాధారణం. అయితే, దీనివెనుక బలమైన న్యాయపరమైన, వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి.
మన దేశంలో వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన ఎక్కువగా గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఎక్కువగా జరుగుతోంది. ఈ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలు దాదాపు అన్నీ ఢిల్లీ, లేదా పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. న్యాయపరంగా ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటే ఢిల్లీ హైకోర్టు పరిధి సానుకూలంగా ఉంటుంది. మరోవైపు, ఈ ఆదేశాలపై చర్యలు తీసుకునే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించే కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ట్రాయ్ వంటి ప్రభుత్వ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఢిల్లీలోనే కేంద్రీకృతమయ్యాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇస్తే, ఈ కేంద్ర సంస్థలు వెంటనే రంగంలోకి దిగి అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి అభ్యంతరకరమైన కంటెంట్‌ను తక్షణమే తొలగిస్తాయి. అంటే, ఢిల్లీలో ఒక ఉత్తర్వు వెలువడితే అది దేశవ్యాప్తంగా అమలవుతుందన్నమాట.
Read Also- Jagga Reddy: మోదీ ఇచ్చిన హామీలపై నీకు నోరు రాదా.. కిషన్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్..!
ఇక, ఢిల్లీ హైకోర్టులో మేధో సంపత్తి హక్కుల (Intellectual Property Rights) కోసం ప్రత్యేకంగా ఒక విభాగమే ఉంది. కాపీరైట్, ట్రేడ్‌మార్క్, పర్సనాలిటీ రైట్స్ వంటి కేసులను ఈ విభాగం వేగంగా విచారణ జరుపుతుంది. తద్వారా సెలబ్రిటీలు చాలా త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. మొత్తంగా, ఇతర రాష్ట్రాల హైకోర్టు తీర్పులు ఇస్తే, ఆయా రాష్ట్ర పరిధిలోని వ్యక్తులపై మాత్రమే తక్షణ ప్రభావం ఉండవచ్చు. కానీ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఉత్వర్వుల ద్వారా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలను కూడా సులభంగా నియంత్రించవచ్చు. అందుకే, అగ్ర హీరోలంతా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు వేస్తున్నారు.

