Constable Incident: ఇటీవలే సంగారెడ్డిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య
అప్పులపాలై రికవరీ చేసిన బంగారాన్నిఅమ్ముకున్న అంబర్‌పేట ఎస్ఐ
తాజాగా హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ లు పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దురాశ దు:ఖానికి చేటు అని తెలిసినా బెట్టింగులు కాస్తూ కష్టార్జితాన్ని పోగొట్టుకుని, అప్పుల పాలవుతున్నారు. ఆ తరువాత వాటి నుంచి బయట పడలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు నేరాల బాట పడుతున్నారు. ఇటీవలి కాలంలోనే ఓ కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్ ల కారణంగా ఆత్మహత్య చేసుకోగా…తాజాగా మరో కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఇక, ఎస్ఐ స్థాయి అధికారి చేసిన అప్పులు తీర్చటానికి ఏకంగా ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని అమ్ముకున్నాడు.
డిపార్ట్‌మెంట్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఈ ఉదంతాలతో పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం కలవరం వ్యక్తమవుతోంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లకండి…జీవితాలను ఆగం చేసుకోకండి అంటూ పోలీసు ఉన్నతాధికారులు తరచూ ప్రజలను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై సోషల్ మీడియా ద్వారా ఓ ఉద్యమాన్నే నడిపించారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసు శాఖలో పని చేస్తున్న వారిలోనే కొందరు ఈ ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడటం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. లక్కు తగిలితే లక్షలు సంపాదించ వచ్చని ఆశపడుతున్న వీళ్లు బెట్టింగులు పెడుతూ నిండా మునుగుతున్నారు.
Read Also- SIR in Telangana: తెలంగాణలో ‘సర్’.. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కీలక ప్రకటన
అయినా, అలవాటును మానుకోలేక అందినకాడ అప్పులు చేస్తున్నారు. ఆ తరువాత వాటిని తీర్చలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. 2024వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన సందీప్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ కు అలవాటు పడి లక్షల రూపాయలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయటం మొదలు పెట్టటంతో ఏం చేయాలో పాలుపోక గతనెల 3న మహబూబ్ సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైడ్రా కమిషనర్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ కృష్ణ చైతన్య కూడా ఆన్‌లైన్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించినట్టుగా వార్తలొచ్చాయి. అంబర్ పేట స్టేషన్ లో ఎస్ఐగా పని చేసిన భానుప్రకాశ్ ఇలాగే బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకోవటంతోపాటు అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చుకోవటానికి ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న నాలుగు తులాల బంగారాన్ని బాధితులకు తిరిగి ఇవ్వకుండా అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. కాగా, తన సర్వీస్ రివాల్వర్ ను సైతం భానుప్రకాశ్ అమ్ముకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
Read Also- Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

