SIR in Telangana: విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) త్వరలోనే తెలంగాణలో (SIR in Telangana) మొదలుకాబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటన చేశారు. సర్‌ను (SIR) తెలంగాణలో చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ సజావుగా, విజయవంతంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం (డిసెంబర్ 21) నాడు రాజధాని హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో జరిగిన బూత్ లెవల్ ఆఫీసర్లతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సర్‌ను అంతా కలిసి సక్సెస్ చేద్దామని చెప్పారు. రివిజన్ ప్రాసెస్‌లో భాగంగా ఒక్కో బూత్ లెవల్ ఆఫీసర్ సగటున 930 ఓటర్లను తనిఖీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. సర్ నిర్వహణ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇటీవల బీహార్ జరిగిన సర్ ప్రక్రియ ఒక మైలురాయిగా నిలిచిందని జ్ఞానేశ్ కుమార్ కొనియాడారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో భారత ఎన్నికల సంఘం ఆదర్శప్రాయ స్థితికి చేరుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, జ్ఞానేష్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణలో ఉన్నారు.
ఏంటీ సర్?
సాధారణంగా అయితే ఓటర్ల జాబితా సవరణ కోరుతూ ఓటర్లే దరఖాస్తు చేసుకుంటారు. కానీ సర్ (SIR) ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అనుమానిత ఓటర్ల విషయంలో నివాస, పౌరసత్వ ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కాగా, ఈ ప్రక్రియను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తీవ్రంగా తప్పుబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సరైన పత్రాలు లేని పేదలు, వలసదారులు, మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ ప్రక్రియను వాడుకుంటోందని, ఇదొక ఓట్ చోరీ అని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, ఎన్నికల సంఘం వాదన మరోలా ఉంది. చనిపోయిన వారు, ఊరు విడిచి వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లను తొలగించి జాబితాను ప్రక్షాళన చేయవచ్చని అంటున్నారు. అక్రమ వలసదారులు ఓటర్లుగా చేరకుండా అడ్డుకోవడం ద్వారా ఎన్నికలపై నమ్మకం పెరుతుందని ఎన్నికల సంఘం అంటోంది.
Read Also- Brahmani Birthday: హీరో నిఖిల్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి

