Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్.. ప్రస్తుతం యావత్ ఏపీ దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో ర్యాపిడో నడుపుతున్న విజయవాడకు చెందిన మహిళను చూపించారు. ఆమె రోజువారీ జీవితాన్ని కళ్లకు కట్టారు. పురుషులకు ధీటుగా విజయవాడ రోడ్లమీద ఆమె స్కూటీని నడుపుతున్న తీరు.. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మంత్రి నారా లోకేష్ సైతం ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ర్యాపిడో నడుపుతున్న మహిళ ఎవరు? లోకేష్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? ఈ కథనంలో పరిశీలిద్దాం.
లోకేష్ ఏమన్నారంటే?
ర్యాపిడో నడుపుతున్న మహిళ వీడియోను పోస్ట్ చేస్తూ.. నారా లోకేష్ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. ‘ఆమె స్వాతంత్రం గురించి కలలు కనింది. ఈరోజు దాని వైపు ప్రయాణిస్తోంది. మా ఉచిత బస్ ప్రయాణ పథకం (SthreeShakti) ఘన విజయం సాధించిన తరువాత ర్యాపిడో (rapidobikeapp)తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాం. దీని ద్వారా 1000కుపైగా ఏపీ మహిళలు డ్రైవర్ సీట్లో కూర్చున్నారని తెలియజేయడానికి ఆనందంగా ఉంది’ అని నారా లోకేష్ అన్నారు.
#IdhiManchiPrabhutvam
She dreamt of independence, and today she rides toward it. After the grand success of our #SthreeShakti free bus travel scheme, we are pleased to announce that in partnership with @rapidobikeapp, 1000+ AP women have taken the driver’s seat. With bike loans… pic.twitter.com/7EfJ5wQ3xB— Lokesh Nara (@naralokesh) August 25, 2025
ర్యాపిడో మహిళ గురించి..
ర్యాపిడోకు నడుపుతున్న మహిళ విషయానికి వస్తే.. ఆమె పేరు భవాని. విజయవాడలోని కేథరాజ్ పేటలో ఉంటోంది. లోకేష్ పోస్ట్ చేసిన వీడియోలో భవాని.. తన కుటుంబానికి సంబంధించిన విషయాలను స్వయంగా పంచుకున్నారు. ‘మా కుటుంబంలో నేను, నా భర్త, ఒక పాప ఉంటాం. పక్షవాతం రావడంతో నా భర్త ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు. గతంలో మా కుటుంబ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ర్యాపిడోలో చేరిన తర్వాత మా ఆదాయం పెరిగింది’ అని భవాని చెప్పుకొచ్చారు.
‘పురుషులే నడపాలని లేదు’
‘ర్యాపిడోను పురుషులు మాత్రమే నడపాలా? మేము ఎందుకు నడపకూడదు. డ్రైవర్లుగా మేము ఎందుకు ఉండకూడదని నేను ముందుకు రావడం జరిగింది. ర్యాపిడో నడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. నేను స్వయం సహాయక గ్రూప్ లో ఉన్నా. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రోత్సాహంతో ఈ ర్యాపిడో వచ్చింది’ అని భవాని తెలిపారు.
Also Read: Nagarkurnool: విహరిద్దామని భార్యను తీసుకెళ్లి.. నల్లమలలో సైలెంట్‌గా తగలబెట్టేశాడు!
‘మహిళలు సేఫ్‌గా ఫీలవుతున్నారు’
ర్యాపిడో స్కూటీ తన కుటుంబ అవసరాలను ఎంతగానో తీరుస్తోందని భవాని అన్నారు. పాప చదువుకు, భర్త మందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పారు. ‘ర్యాపిడో బుక్ చేసుకోగానే పెట్టిన లోకేషన్ కు వెళ్తున్నాను. ఒకప్పుడు ర్యాపిడో బుక్ చేసుకోగానే మగవారు వచ్చేవారు. ఇప్పుడు ఆడవారు వస్తుండంతో మహిళలు సైతం హ్యాపీగా ఉన్నారు. తమ ప్రయాణాన్ని వారు చాలా సేఫ్ గా ఫీలవుతున్నారు’ అని భవాని వివరించారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో చదువు రాకపోయినా.. డ్రైవర్లుగా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడే మహిళలకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.