Nadendla vs Narayana: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నెల్లూరు టీడీపీ రేషన్ మాఫియా చిచ్చురేపింది. మంత్రులుగా ఉన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్.. టీడీపీ నేత నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రేషన్ మాఫియాతో పౌరసరఫరా శాఖ అధికారులు కమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. తన శాఖ మీద అలా ఎలా ఆరోపణలు చేస్తారని నారాయణను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారింది.
‘మీ శాఖ గురించి.. నేనూ మాట్లాడనా’
మంత్రి నారాయణ తన శాఖ అయిన పౌరసరఫరాల గురించి మాట్లాడటం సరికాదని మంత్రి నాదెండ్ల పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాను కూడా నారాయణ బాధ్యత వహిస్తున్న మున్సిపల్ శాఖ గురించి మాట్లాడాలా? అంటూ నాదెండ్ల ఘాటుగా ప్రశ్నించినట్లు సమాచారం. నాదెండ్ల వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి నారాయణ.. నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘గొప్పల కోసం ఎవరికి వారు స్టేట్ మెంట్లు ఇచ్చుకుంటే ఇక పార్టీ ఎందుకు’ అని నారాయణ అన్నారు. చిన్న చిన్న పంచాయతీలకు వారానికో, 15 రోజులకు ఒకసారి పవన్ వద్దకు వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తన శాఖను టీడీపీ నేతలే తప్పుబడుతున్నారని మంత్రి నాదెండ్ల తనతో స్వయంగా అన్నట్లు నారాయణ టెలి కాన్ఫరెన్స్ స్పష్టం చేశారు. తాము అసలు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నామా? అని నాదెండ్ల సూటిగా ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు.
మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
మరోవైపు జిల్లా (నెల్లూరు) నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తనను ప్రశ్నించినట్లు మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ లో అన్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేకుండా జిల్లా నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడవద్దని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోమారు కూటమిలో చీలికలు తెచ్చేవిధంగా ఎవరూ ప్రవర్తించవద్దని నారాయణ ఘాటుగా సూచించారు. మరోవైపు నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ బుధవారం బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామయ్య తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని కూడా పల్లా రాజేశ్వర్ హెచ్చరించడం గమనార్హం.
Also Read: Bigg Boss Telugu: హౌస్‌లో కెప్టెన్సీ వార్.. బంతి కోసం రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!
పవన్ కు నాదెండ్ల ఫిర్యాదు..
ఇదిలా ఉంటే నెల్లూరు రేషన్ పంచాయితీ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లినట్లు సమాచారం. పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివాదం గురించి పవన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. తన శాఖ వ్యవహారాల్లోకి నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలు జోక్యం చేసుకుంటున్న తీరును సైతం పవన్ కు నాదెండ్ల వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ.. జిల్లా నేతలను కంట్రోల్ లో ఉంచేందుకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారన్న సమాచారం కూడా అందుతోంది. అయితే జనసేన – టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు వచ్చిన ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా మంత్రుల స్థాయిలో అసంతృప్తులు వ్యక్తం కావడం.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.
